మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష చూపుతోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

మెట్రో విస్తరణపై కేంద్రం వివక్ష చూపుతోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జంట నగరాల ప్రజలు, మెట్రో కారిడార్ పరిధిలోని ప్రజలకు కీలక విషయాలను వెల్లడించారు. విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ అభివ‌ృద్దిని అడ్డుకుంటారని మండిపడ్డారు.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కృషితో మెట్రో ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత చారిత్రక కట్టడాల పేరుతో అప్పటి ప్రభుత్వం మెట్రో మొదటి దశ పనులను అడ్డుకోవడంతో ప్రాజెక్టు మూడేళ్లు ఆలస్యమైందని ఆరోపించారు.

రూ.15 వేల కోట్లతో పూర్తికావాల్సిన మెట్రో ప్రాజెక్టు వ్యయం ఆలస్యం, కోవిడ్ ప్రభావంతో రూ.22 వేల కోట్లకు పెరిగిందన్నారు. దీంతో ఎల్ అండ్ టీ సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని చెప్పారు. గత పదేళ్లలో మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదని విమర్శించారు. ఫేజ్-2 మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు సంప్రదించామని, అయితే ఎల్ అండ్ టీతోనే ప్రాజెక్టును నిర్మించాలని కేంద్రం షరతు పెట్టిందన్నారు. కానీ నష్టాల కారణంగా ఎల్ అండ్ టీ అందుకు నిరాకరించిందని వెల్లడించారు. దీంతో మెట్రో ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఒక్కటే పరిష్కారమని కేంద్రం సూచించిందన్నారు.

రూ.30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తిని రూ.15 వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ప్రస్తుతం ఉన్న రూ.13,600 కోట్ల రుణాన్ని తక్కువ వడ్డీకి మార్చేందుకు చర్యలు తీసుకున్నామని సీఎం వివరించారు. జపాన్ ఆర్థిక సంస్థల సహకారంతో 4 శాతం వడ్డీకే రుణం సమకూర్చుకున్నప్పటికీ, ఆ నిధుల బదిలీని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, విశాఖపట్నంలకు మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ విషయంలో వివక్ష చూపుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. మెట్రో ఫేజ్-2లో కేంద్రం భాగస్వామ్యం వహిస్తుందా? లేక ఎన్‌వోసీ ఇచ్చి తప్పుకుంటుందా? అనే విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల అవసరాల కోసం మెట్రో విస్తరణను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు