తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు వేలాదిమంది భక్తులు కొండపైకి చేరుకుంటారు. వివిధ దర్శనాలతో స్వామివారిని దర్శించుకుంటారు. టీటీడీ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ టికెట్లను విడుదల చేస్తోంది. తాజాగా దేశ, విదేశాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారికి ఎయిర్‌పోర్టుల్లోనే టికెట్లను విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్దమవుతోంది. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు దర్శన టికెట్లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఎయిర్‌పోర్టుల్లో శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం భక్తుల కోసం తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి టికెట్లను అందిస్తున్నారు. ఇదే తరహాలోనే రాష్ట్రంలోని మూడు ఎయిర్‌పోర్టుల్లో కూడా టికెట్లను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని వల్ల దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు ఎయిర్‌పోర్టుల్లోనే టికెట్లు పొందవచ్చు. శ్రీవారి దర్శనం సులువుగా చేసుకోవచ్చు.
ఈ మూడు ఎయిర్‌పోర్టుల్లో..
గన్నవరం, రాజమండ్రి, విశాఖపట్నం ఎయిర్‌పోర్టుల్లో శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేసేందుకు టీటీడీ రెడీ అవుతోంది. ఇందుకోసం ఎయిర్‌పోర్టుల్లో కియోస్క్ మెషీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మెషిన్ల ద్వారా రూ.10,500 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఫొటో తీసి టికెట్ జారీ చేస్తారు. అనంతరం తిరుమల క్యూలైన్లోకి చేరుకున్నాక టికెట్ స్కాన్ చేసి దర్శనానికి అనుమతిస్తారు. త్వరలోనే దీనిపై టీటీడీ తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం తిరుపతి ఎయిర్‌పోర్టులో ఆప్‌లైన్‌లో 200 శ్రీవాణి టికెట్లను జారీ చేస్తున్నారు. అయితే ఇక నుంచి ఒక్కొ ఎయిర్‌పోర్టులో 50 చొప్పున భక్తులకు అందించాలని చూస్తోంది. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్టుకు 40 వేలకుపైగా భక్తులకు విరాళాలు చెల్లిస్తుండగా.. దర్శనం టికెట్లు తీసుకోవడం లేదు. దీంతో టీటీడీ రోజుకు జారీ చేసిన 800 శ్రీవాణి దర్శన టికెట్లను 500కు తగ్గించాలని చూస్తోంది. ఇక మిగిలిన 300 టికెట్లను గతంలో టికెట్లు పొందలేని శ్రీవాణి దాతలకు కేటాయించాలని భావిస్తోంది.
ఆఫ్లైన్లోనూ టికెట్లు
కాగా టీటీడీ ఆన్లైన్పాటు ఆప్‌లైన్‌లోనూ టికెట్లు జారీ చేస్తోంది. ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తోంది. ఇక ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం, స్లాటెడ్ సర్వ దర్శనం టికెట్లను అందిస్తోంది. తిరుపతిలో ఈ టికెట్లను అందిస్తున్నారు. రోజుకు 15 వేల వరకు ఈ టికెట్లను ఆఫ్‌లైన్‌లో అందిస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడిక్కడ త్రాగునీరు అందిస్తోంది. అంతేకాకుండా ఆహారం కూడా అందిస్తోంది.

