ఇంటి నుంచి వెళ్లింది సాధారణ కానిస్టేబుల్.. కానీ తిరిగొచ్చింది మాత్రం అందరూ మెచ్చిన అధికారి..

ఇంటి నుంచి వెళ్లింది సాధారణ కానిస్టేబుల్.. కానీ తిరిగొచ్చింది మాత్రం అందరూ మెచ్చిన అధికారి..

2012లో సాధారణ CRPF కానిస్టేబుల్‌గా చేరి, అత్యంత ప్రమాదకరమైన కోబ్రా విభాగంలో దేశ సేవ చేసిన కృష్ణాజిల్లా యువకుడు వెంకటేష్.. ఇప్పుడు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఒకప్పుడు మా అబ్బాయి సైనికుడు అని గర్వపడిన తల్లిదండ్రులు, ఊరి జనం.. నేడు మా వాడు అధికారి అయ్యాడు అంటూ ఘనంగా సత్కరించారు.

కృష్ణాజిల్లా కంకిపాడులోని ఓ సాధారణ కుటుంబానికి 21.05.2012 అది మరపురాని రోజు. ఎందుకంటే ఆ రోజు వారి కొడుకు వెంకటేష్ సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికై దేశ సేవలో అడుగుపెట్టాడు. చాలామందిలా ఒక ఉద్యోగం సంపాదించాలనే ఆలోచనతో కాదు.. యూనిఫాం ధరించి దేశానికి సేవ చేయాలనే కోరికతో ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. సీఆర్‌పీఎఫ్‌లో చేరిన తర్వాత కూడా సులభమైన దారిని వెతకలేదు. ప్రమాదాలతో నిండిన, అత్యంత క్లిష్టమైన కోబ్రా విభాగాన్ని స్వచ్ఛందంగా ఎంచుకున్నాడు.

అడవుల్లో ఆపరేషన్లు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు.. నెలల తరబడి కుటుంబానికి దూరంగా జీవితం.. ప్రతి రోజూ ప్రమాదాలతో పోరాటం. ఒకవైపు తల్లిదండ్రులు కొడుకు క్షేమంగా ఉండాలని ఎదురుచూస్తుంటే, మరోవైపు వెంకటేష్ మాత్రం దేశ భద్రత కోసం తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగాడు. పండుగలు వచ్చాయి.. కుటుంబ వేడుకలు జరిగాయి.. బంధువుల పెళ్లిళ్లు జరిగాయి. కానీ వాటిలో చాలా వరకు వెంకటేష్‌కు దూరంగానే గడిచిపోయాయి. ఎందుకంటే ఆయనకు ముందు విధి.. తర్వాతే వ్యక్తిగత జీవితం. ఆ కష్టం వృథా కాలేదు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకిత భావానికి గుర్తింపుగా హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి వచ్చింది.

ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ)గా ప్రమోషన్ పొందాడు.. ఒకప్పుడు మా అబ్బాయి సైన్యంలో చేరాడు అని గర్వపడిన కుటుంబ సభ్యులు. ఇప్పుడు మా అబ్బాయి అధికారిగా ఎదిగాడు అని ఆనందంతో చెబుతున్నారు. తాజా పదోన్నతి నేపథ్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన అభినందన సమావేశం భావోద్వేగంగా మారింది.

చిన్ననాటి స్నేహితులు, బంధువులు, గ్రామ పెద్దలు వెంకటేష్‌ను ఘనంగా సత్కరించారు. ఒకప్పుడు తమ మధ్య తిరిగిన యువకుడు నేడు దేశ భద్రతలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారిగా ఎదగడంపై గర్వంగా ఫీల్ అవుతున్నారు. వెంకటేష్ కథ కేవలం ఒక పదోన్నతి కథ కాదు. అది ఒక కుటుంబం ఎదురుచూపుల కథ. ఒక యువకుడి దేశభక్తి కథ.. యూనిఫాంపై ఉన్న ప్రేమతో మొదలై, నేడు అధికార హోదా వరకు చేరిన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు