ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎన్జీ, ఎల్పీజీ మధ్య నెలకొన్న అవాంతరాలను తొలగించేందుకు పలు నిబంధనలను మార్చింది. ఇక నుంచి సులువుగా పీఎన్జీ నుంచి ఎల్పీజీ కనెక్షన్లకు వినియోగదారులు మారవచ్చు. ఈ మేరకు రూల్స్‌ను నోటిఫై చేసింది.
ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఎల్పీజీ నియంత్రణ విషయంలో పలు మార్పులు చేసింది. పెట్రోలియం గ్యాస్ సరఫరా, పంపిణీ నియంత్రణ సవరణ ఉత్తర్వులు 2026 నోటిఫై చేస్తూ ప్రకటన జారీ చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ పొందే డొమెస్టిక్ వినియోగదారులకు అదనపు ఉపశమనం, సౌకర్యం కల్పించేందుకు నిబంధనలను సవరించారు. పీఎన్జీ కనెక్షన్లు పొందే వినియోగదారులకు సౌకర్యం కల్పిస్తూ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చారు
పీఎన్జీ కనెక్షన్లు ఉన్న ఎల్పీజీ వినియోగదారులకు పలు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. పైప్డ్ నేచురల్ గ్యా్స్ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్ రద్దు చేయమని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక భవిష్యత్తులో నాన్ పీఎన్జీ ప్రాంతంలోకి మారినప్పుడు ఎల్పీజీ కనెక్షన్ పునరుద్దరించుకునేందుకు ట్రాన్స్ఫర్ వోచర్ ఉపయోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.
పీఎన్జీ అందుబాటులో లేని ప్రాంతాలకు వినియోగదారులు మారినప్పుడు ఈ నిబంధనలతో ఊరట కలగనుంది. తరచుగా ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ అవుతుంటారు. ఇలాంటి ఉద్యోగులకు ఇది ప్రయోజనకరంగా ఉండనుంది. ఇక ప్రవాస కుటుంబాలు, అద్దెదారులు, విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేకూర్చనుంది.
ఎల్పీజీ, పీఎన్జీ సేవల మధ్య సులభమైన, అవాంతరాలు లేని మార్పును నిర్ధారించేందుకు కేంద్రం నిబంధనల్లో మార్పులు చేసింది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా మారవచ్చు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం వల్ల హర్ముజ్ జలసంధి మూతపడింది. దీని వల్ల ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగడంతో పీఎన్జీ కనెక్షన్లను కేంద్రం ప్రోత్సహిస్తోంది.
పీఎన్జీలోకి మారేవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సాహాకాలు కూడా ప్రకటిస్తున్నాయి. పీఎన్జీ కనెక్షన్లు తీసుకుంటే సబ్సిడీలు కూడా ప్రకటిస్తు్న్నాయి. ఇక చమురు కంపెనీలు కూడా పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పీఎన్జీ కనెక్షన్లు ఉన్నవారు ఎల్పీజీ కనెక్షన్లను సరెండర్ చేయాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. ఒకేసారి రెండు కనెక్షన్లు ఉండకూదని సూచించింది.

