పాత మట్టి ఇళ్లు, వర్షం కురిసే వేళ కాగితపు పడవ ఆటలు… 90ల నాటి పల్లె జీవితం, మన చిన్ననాటి జ్ఞాపకాలు. ఎండలో మట్టి ఇంటి సహజసిద్ధమైన చల్లదనం, వానలో మట్టి వాసన, అరుగులపై కబుర్లు, నేరేడు పండ్ల రుచి – ఇవన్నీ ఇప్పుడు ఎంత కోరుకున్నా దొరకని ఆత్మీయతను, ప్రశాంతతను అందిస్తాయి. ఆధునికతలో కోల్పోయిన ఆ మధురానుభూతులను ఈ కథనంలో గుర్తు చేసుకుందాం …
నేటి ఆధునిక యుగంలో మనం అపార్ట్మెంట్లు, ఏసీ గదుల్లో నివసిస్తున్నప్పటికీ, 90వ దశకంలోని మన చిన్ననాటి పల్లె జ్ఞాపకాలు, మట్టి ఇళ్లు, వర్షాకాలపు ఆటలు మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి. కరెంటు పోతే ఉక్కపోతతో సతమతమవుతున్నప్పుడు, ఆ మట్టి ఇళ్ల చల్లదనం ఎంత గొప్పదో గుర్తుకు వస్తుంది. ఆ మట్టి ఇళ్లు కేవలం గోడలు, కప్పు మాత్రమే కాదు, అవి ఆత్మీయతకు, ఆనందానికి నిలయాలు.
మట్టి ఇళ్ల చల్లదనం, ఆరోగ్యం:
ఎండకాలంలో సూర్యుడు మండుతున్నప్పుడు మట్టి ఇళ్లలోకి దూరితే చాలు, ఏసీలు, కూలర్లు లేకపోయినా అరికాళ్ల నుంచి నెత్తి దాకా అమృతం లాంటి చల్లదనం అనుభవమయ్యేది. లావుపాటి మట్టి గోడలు, పెంకుటి కప్పులు సూర్యుడి వేడిని లోపలికి రానిచ్చేవి కావు. మధ్యాహ్నం పూట ఆ చల్లటి మట్టి నేల మీద ఈత చాప వేసుకుని పడుకుంటే, ఫైవ్ స్టార్ హోటల్ బెడ్ మీద కూడా దొరకని సుఖం అది. అంతేకాదు, వసారా మూలన ఉన్న మట్టి కుండలోని నీళ్లు తాగితే గొంతులోంచి ప్రాణం లేసొచ్చేది. ఫ్రిజ్‌లో ఐస్ నీళ్లు తాగి గొంతు నొప్పులు తెచ్చుకుంటున్న ఈ రోజుల్లో, ఆ మట్టి కుండ నీళ్లే మనకు థమ్సప్, పెప్సీలు. వారానికోసారి అమ్మమ్మలు, నానమ్మలు ఇల్లు అలికినప్పుడు వచ్చే ఆ పచ్చి మట్టి వాసన, ఎంత ఖరీదైన పర్ఫ్యూమ్ కన్నా గొప్ప అనుభూతిని ఇచ్చేది. ఆ మట్టి గోడల ఆరోగ్యకరమైన స్పర్శ, అవి అందించిన ప్రశాంతత ఇప్పుడు ఎక్కడా లేదు.
వర్షం ముచ్చట్లు, ఆటలు:
జూన్ నెల రాగానే వాతావరణం మారిపోయేది. నల్లటి మబ్బులు ఆకాశాన్ని కమ్మేసి, ఉరుములు, పెద్ద పెద్ద గాలి వానలు మొదలయ్యేవి. మొదటి వాన చినుకు ఎండిపోయిన మట్టి నేల మీద పడగానే వచ్చే కమ్మటి వాసన, మనసును చిన్ననాటి జ్ఞాపకాల్లోకి లాక్కెళ్లేది. మట్టి ఇళ్లలో వర్షాకాలం అంటే అదొక పెద్ద అడ్వెంచర్ గేమ్. పాత పెంకుటి ఇళ్లలో ఎక్కడో ఒక చోట చినుకు పడినప్పుడు గిన్నెలు, డబ్బాలు పెట్టి, టప్ టప్ మ్యూజిక్‌ను వింటూ మురిసిపోయేవాళ్ళం. వాన తగ్గగానే వీధిలోకి పరుగు తీసి, పాత నోట్‌బుక్ పేజీలతో కాగితపు పడవలు చేసి, వర్షపు నీటి కాలువల్లో వదిలి పందాలు వేసుకునేవాళ్లం. బురదలో కాళ్లు పెట్టి తొక్కుతూ, ముఖం మీద బురద పడినా నవ్వుకుంటూ ఆడుకున్న ఆ రోజులు ఎంత ఆనందాన్ని ఇచ్చాయో! అప్పట్లో ఆ బురదలో ఆడుకున్నా ఏ రోగాలు వచ్చేవి కావు, ఎందుకంటే ఆ మట్టిలో అంత అమృతం ఉండేది. వాన పడి వెలిసిన తర్వాత ఆకాశంలో సూర్యుడో, చంద్రుడో మనతో పాటే వస్తున్నట్లు అనిపించే ఆ అమాయకత్వం, ఇప్పుడు కోట్లు పెట్టినా దొరకని ఆనందాన్ని ఇచ్చేది.
పల్లె జీవితం, ఆత్మీయత:
వర్షాకాలం ఆరంభంలో ఊరి చివర ఉన్న నేరేడు చెట్ల పళ్ళు రాలితే, బురదలో పడిన వాటిని కూడా ఏరుకుని, చొక్కాకి తుడుచుకుని తినడం ఒక పెద్ద సంబరం. నాలుకంతా వంకాయ రంగులోకి మారితే, అందరికీ చూపించి వెక్కిరించుకునే ఆ ఆనందం ఇప్పుడు ఏ ఆపిల్స్, కివీస్ ఇవ్వలేవు. మట్టి ఇళ్ల గోడలలో ఉండే చిన్న చిన్న గూళ్లు, తాతయ్య కళ్లద్దాలు, అమ్మమ్మ దాచుకున్న నాణేలు, మనం దాచుకున్న గోలీలు, బొంగరాలు దాగుండే పెద్ద ట్రెజర్ హంట్ అవి. సాయంత్రం చీకటి పడగానే ఆ గూట్లోనే కిరోసిన్ దీపమో, లాంతరో వెలిగించి, దాని వెలుగులో గోడ మీద నీడలతో బొమ్మలు చేసుకుంటూ, దెయ్యంలా భయపెట్టుకుంటూ ఆడుకున్న రాత్రులు మధురమైనవి. ఆ లాంతరు దీపాల వెనుక ఉన్న ఆత్మీయత ఇప్పుడు వేల వాట్ల LED లైట్లలో వెతికినా దొరకదు. పండుగలప్పుడు ఆవు పేడతో కల్లాపి చల్లి, బియ్యప్పిండితో పెద్ద పెద్ద ముగ్గులు పెడితే, ఆ ఇళ్లలో లక్ష్మీ కళ, ప్రశాంతత వెల్లివిరిసేది. మట్టి ఇళ్ల ముందు ఉండే పెద్ద అరుగులు, ఊర్లో వాళ్ళంతా కలిసి ముచ్చట్లు తలుచుకుంటూనే కళ్ల వెంట నీళ్లు తిరుగుతాయి. ఒకరి కష్టసుఖాలు ఇంకొకరు పంచుకుంటూ, ఆత్మీయతతో బ్రతికిన ఆ పల్లె జీవితం ఎప్పటికీ మన గుండెల్లో పదిలంగా ఉంటుంది.

