వీరభద్రుడు సినిమా రివ్యూ.. సూర్య గాడ్ మోడ్.. దేవుడు చేసిన పోరాటం..!

వీరభద్రుడు సినిమా రివ్యూ.. సూర్య గాడ్ మోడ్.. దేవుడు చేసిన పోరాటం..!

కొన్నేళ్లుగా సూర్య నుంచి సరిగ్గా కోరుకున్న సినిమా అయితే రావడం లేదు. చాలా సినిమాలు చేస్తున్నా కూడా కోరుకున్న ఫలితం లేదు. ఇలాంటి సమయంలో ఆయన నుంచి వచ్చిన రూరల్ డివోషనల్ డ్రామా వీరభద్రుడు. ఈ సినిమా ఎలా ఉంది.. మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: వీరభద్రుడు

నటీనటులు: సూర్య, త్రిష, ఆర్జే బాలాజీ, ఇంద్రాన్స్, నట్టి సుబ్రమణ్యం, సుప్రీత్, అనఘా మాయ తదితరులు

సంగీతం: సాయి అభ్యంకర్

సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు

ఎడిటర్: కళైవాణన్

నిర్మాతలు: SR ప్రభు, SR ప్రకాష్ బాబు

దర్శకుడు: ఆర్జే బాలాజీ

కథ:

తమిళనాడుకు చెందిన ఒక తండ్రీకూతురు హైదరాబాద్‌కు వస్తారు. అనారోగ్యంతో ఉన్న తన కూతురు (అనఘా మాయ)కు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించాలన్నది తండ్రి (ఇంద్రాన్స్) ఆరాటం. అప్పటికే ఆర్థికంగా నష్టపోయిన ఆ తండ్రీ కూతురుకు హైదరాబాద్‌లో అడుగు పెట్టగానే ఎదురుదెబ్బ తగులుతుంది. సర్జరీ కోసం వాళ్ల దగ్గర ఉన్న ఏకైక ఆస్తి అయిన నగలు దొంగతనానికి గురవుతాయి. దేవుడి దయ వల్ల పోలీసులు ఆ నగలను వెతికి పట్టుకుంటారు కానీ.. వాటిని లీగల్‌గా వెనక్కి తెచ్చుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగాలని, ఆ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుందని చెబుతారు. ఆ సమయంలో ఆర్జే బాలాజీ (బేబీ కృష్ణ) అనే ఓ లాయర్ వాళ్ల జీవితాల్లోకి వస్తాడు. కానీ సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. వాళ్ల ఫ్యామిలీ నుంచి దోచుకోవడం మొదలుపెడతాడు. కావాలనే కేసును నెలల తరబడి సాగదీస్తూ.. ప్రతి హియరింగ్‌కు, ప్రతి సంతకానికి, కోర్టుకి వచ్చిన ప్రతిసారీ డబ్బులు లాగుతూ ఆ తండ్రిని న్యాయవ్యవస్థ అనే ఉచ్చులో బంధిస్తాడు. ఒక దశలో ఆ తండ్రి బాధ కట్టలు తెంచుకుంటుంది. చేసేదేం లేక కోర్టు ఎదుటే ఉన్న వీరభద్రుడు (సూర్య)ను వేడుకుంటాడు. అప్పుడు న్యాయం కోసం ఆ దేవుడే కిందకి దిగొస్తాడు. అప్పుడే బేబీ కృష్ణ దేవుణ్ణి చూసి భయపడకుండా.. తన మహిమలు పక్కనపెట్టి కేవలం మనిషిలాగా, చట్టప్రకారం న్యాయపోరాటం చేసి గెలవాలని సవాల్ విసురుతాడు.. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన వీరభద్రుడు ఏం చేసాడు.. మనిషిగా తన పోరాటం చేసి గెలిచాడా అనేది అసలు కథ..

కథనం:

వీరభద్రుడు సినిమా లైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.. దేవుడే దిగివచ్చినా కూడా ఇప్పుడున్న న్యాయవ్యవస్థను బాగు చేయలేరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు ఆర్జే బాలాజీ. సినిమా కథనం ప్రధానంగా న్యాయం జరగడంలో అయ్యే ఆలస్యం, సామాన్యులను వ్యవస్థ ఎలా పీల్చి పిప్పిచేస్తుంది అనే పాయింట్ చుట్టూ అద్భుతంగా అల్లారు. అవినీతిని ఏదో పైపైన, మనకు సంబంధం లేని విషయంగా చూపించకుండా, సామాన్యుడి కన్నీటికి దానికి ముడిపెట్టి కథనాన్ని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఫాంటసీ ఎలిమెంట్స్ మొదలవ్వడానికి ముందే ఫస్ట్ హాఫ్‌లో తండ్రీకూతుళ్ల ఎపిసోడ్‌తో ఆడియన్స్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. సామాన్యుడి నిస్సహాయతను ప్రేక్షకులకు కనెక్ట్ చేసిన విధానం బ్రిలియంట్‌గా ఉంటుంది. కమర్షియల్ మాస్ మూమెంట్స్‌ను, సోషల్ మెసేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ రాసుకున్న స్క్రీన్‌ప్లే సినిమాకు మేజర్ హైలైట్. న్యాయం ఆలస్యమైతే అది అన్యాయం కిందే లెక్క అనే పాయింట్‌ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. సెకండాఫ్‌లో ఫాంటసీ ఎలిమెంట్స్ కాస్త ఎగ్జాజరేట్ అయినట్లు అనిపించినా, మొదటి సగంలో చేసిన ఎమోషనల్ సెటప్ స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల ఆడియన్స్ కథలో లీనమవుతారు. వీరభద్రుడి పాత్రను కేవలం ఒక కమర్షియల్ మాస్ హీరోలా కాకుండా, వ్యవస్థ చేతిలో మోసపోయిన సామాన్యుడి కోపానికి ప్రతీకగా మలచడం కథనంలో ఉన్న గొప్పదనం. ఆర్జే బాలాజీ రైటింగ్‌లో కమర్షియల్ మీటర్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. కోర్టు రూమ్ డ్రామాలో వచ్చే పొలిటికల్ సెటైర్లు, సమాజంపై ఫ్రస్ట్రేషన్, డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయి. అయితే తమిళ వాసనలు ఎక్కువ కావడం ఒక్కటే ఇందులో మైనస్. సినిమా మొదట్లో కొన్ని సన్నివేశాలు బాగా నెమ్మదిగా సాగుతాయి కూడా. సూర్య ఇమేజ్‌కు తగ్గట్టుగా పక్కా ప్లానింగ్‌తో ఎలివేషన్స్ రాసుకున్నారు దర్శకుడు బాలాజీ. అయితే సెకండాఫ్‌లో ఎమోషన్ కంటే మాస్ మూమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల స్టోరీ టెల్లింగ్ స్లో అవుతుంది. అయినా కూడా ఈ మధ్య సూర్య సినిమాల్లో బెస్ట్ ఇదే అని చెప్పొచ్చు.

నటీనటులు:

వీరభద్రుడి పాత్రను సూర్య పూర్తిగా ఓన్ చేసుకున్నాడు. ఇది కేవలం స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఇమేజ్‌తో చేసిన పెర్ఫార్మెన్స్ కాదు. దైవత్వం, కోపం, బాధ, ప్రశాంతత, ఎమోషనల్ బ్యాలెన్స్.. ఇలా అన్ని వేరియేషన్స్‌ను చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. ఇంటర్వెల్ తర్వాత సూర్య ట్రాన్స్‌ఫర్మేషన్ సినిమాకు విపరీతమైన ఎనర్జీని తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాలో అందరినీ సర్ప్రైజ్ చేసే పాత్ర ఆర్జే బాలాజీది. బేబీ కృష్ణ అనే లాయర్ పాత్రలో అతను బాగా నటించాడు. విలన్ అనగానే గట్టిగా అరవడం, భయపెట్టడం కాకుండా.. హ్యూమర్, సెటైర్లు వేస్తూనే చాలా కేర్ లెస్‌గా ఎదుటివారిని మోసం చేసే క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. రీసెంట్ తమిళ సినిమాలో బెస్ట్ నెగటివ్ రోల్స్‌లో ఇది ఒకటని ఖచ్చితంగా చెప్పొచ్చు. త్రిష తన పాత్ర పరిధి మేరకు చాలా కంపోజ్డ్ అండ్ సెటిల్డ్‌గా నటించింది. ఫస్ట్ హాఫ్‌లో తండ్రీకూతుళ్లుగా నటించిన ఇంద్రాన్స్, అనఘా మాయ సినిమా ఎమోషన్‌ను పెంచేసారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

సాయి అభ్యంకర్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చాలా వరకు సినిమా రేంజ్ పెంచేసాడు. ఈ సినిమాకు ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్‌లో మ్యూజిక్ ఒకటి. ఎమోషనల్ సీన్స్, హీరో ఎలివేషన్స్, కోర్టు రూమ్ సీన్స్‌ను BGM బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు లార్జర్ దాన్ లైఫ్ అప్పీల్ తీసుకొచ్చింది. ముఖ్యంగా దైవత్వానికి సంబంధించిన ట్రాన్స్‌ఫర్మేషన్ సీన్స్‌లో కెమెరా వర్క్ బాగుంది. కాకపోతే కొన్ని కీలకమైన సన్నివేశాల్లో వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీ బాలేదు. ఎడిటింగ్ ఓకే.. రైటర్‌గా ఆర్జే బాలాజీకి ఫుల్ క్రెడిట్స్ దక్కుతాయి. నేటి తరం ఆడియన్స్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది తెలుసుకుంటూనే, కథలోని ఎమోషనల్ డెప్త్ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ‘వీరభద్రుడు’.. దేవుడు చేసిన న్యాయం..!

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు