తెలంగాణలో భారీగా పండిన మొక్కజొన్నను ఏపీ జగ్గయ్యపేట గోడౌన్స్‌కు తరలించడంతో నిల్వ కేంద్రాలు పూర్తిగా నిండిపోయాయి. రోజుకు కొద్ది లారీల సరుకే అన్లోడ్ చేస్తుండటంతో వందలాది లారీ డ్రైవర్లు 14 రోజులుగా గోడౌన్స్ వద్దే నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు గోడౌన్స్ ఫుల్ అయ్యాయని చెప్పి వెనక్కి వెళ్లాలంటుండటంతో డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఈసారి మొక్కజొన్న పంట బాగా పండింది. రైతులు ఆశించిన దిగుబడులు రావడంతో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, గోడౌన్స్ అన్నీ మొక్కజొన్న నిల్వలతో నిండిపోయాయి. అయితే పంట ఎక్కువగా రావడం ఇప్పుడు రైతులకే కాదు.. లారీ డ్రైవర్లకు కూడా పెద్ద కష్టంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని ఎర్రుపాలెం, కొణిజర్ల, చింతకాని, నాగలవంచ, మధిర ప్రాంతాల సొసైటీల నుంచి భారీగా మొక్కజొన్నను ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వేర్‌హౌస్ గోడౌన్స్ ప్రస్తుతం పూర్తిగా నిండిపోయాయి.
గోడౌన్స్ ముందు కిలోమీటర్ల మేర లారీలు
జగ్గయ్యపేట గోడౌన్స్ బయట మొక్కజొన్న లారీల బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వందలాది లారీలు రోజుల తరబడి అక్కడే నిలిచిపోయాయి. గోడౌన్స్‌లో రోజుకు కేవలం 13 లారీల సరుకే అన్లోడ్ చేస్తుండటంతో.. మిగతా డ్రైవర్లు 14 రోజులుగా ఎదురుచూస్తున్నారు. మే 1వ తేదీన తెలంగాణ నుంచి లోడింగ్‌తో బయలుదేరిన కొన్ని లారీలు ఇప్పటికీ అన్లోడ్ కాకుండానే గోడౌన్స్ బయట నిలిచిపోయాయి. తిండి, నిద్ర, స్నానం వంటి కనీస సౌకర్యాలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం ఎదురుచూసిన తర్వాత.. ఇప్పుడు గోడౌన్స్ పూర్తిగా నిండిపోయాయని, లారీలు వెనక్కి తీసుకెళ్లాలని సిబ్బంది చెప్పడంతో డ్రైవర్లు షాక్‌కు గురయ్యారు. డ్రైవర్లు తెలంగాణ మార్క్‌ఫెడ్ అధికారులకు, రైతులకు ఫోన్ చేస్తే.. “అక్కడే అన్లోడ్ చేయాలి, మాకు సంబంధం లేదు” అనే సమాధానం వస్తోందని వారు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో.. విజయవాడ, చిలుకూరు తదితర ప్రాంతాల్లోని ఇతర గోడౌన్స్‌కు వెళ్లి సరుకు అన్లోడ్ చేయాలని తెలంగాణ సొసైటీ అధికారులు సూచించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే రెండు వారాలుగా రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్న డ్రైవర్లు.. ఇంకా ఎన్ని రోజులు తిరగాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రైతులు పండించిన పంట నిల్వకు చోటులేక ఇబ్బంది పడుతుంటే… మరోవైపు లారీ డ్రైవర్లు రోడ్డుపైనే జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరైన సమన్వయం లేకపోవడం వల్ల రైతు నుంచి డ్రైవర్ వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు స్పందించి.. గోడౌన్స్ నిర్వహణ, అన్లోడింగ్ ప్రక్రియలో స్పష్టత తీసుకువచ్చి డ్రైవర్ల సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

