బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టించిన సర్కార్ ఎక్స్‌ప్రెస్ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జూన్ 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో అప్పికట్ల సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి పాల్పడిన ముఠా బయటపెట్టిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
బాపట్ల జిల్లాలో సంచలనం సృష్టించిన సర్కార్ ఎక్స్‌ప్రెస్ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జూన్ 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో అప్పికట్ల సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి పాల్పడిన ముఠా బయటపెట్టిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల కథనం ప్రకారం, సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు అప్పికట్ల వద్ద ప్రయాణిస్తున్న సమయంలో ఆరుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా అత్యవసర చెయిన్ లాగి రైలును నిలిపివేసింది. ప్రయాణికులు నిద్రలో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఎస్-3, ఎస్-6 బోగీల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కునేందుకు ప్రయత్నించింది. బాధితులు అప్రమత్తమై కేకలు వేయడంతో భద్రతా సిబ్బంది సాయి కృష్ణ వెంటనే స్పందించి దొంగలను వెంబడించారు.
ఈ క్రమంలో దొంగలు సమీప పొలాల వైపు పారిపోగా, అక్కడ సెల్‌ఫోన్ లైట్ల వెలుగులు కనిపించడంతో పెట్రోలింగ్ పోలీసులు అనుమానించి దాదాపు పది రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. అయినప్పటికీ నిందితులు తప్పించుకుని పరారయ్యారు. ఘటన అనంతరం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గాలింపు చేపట్టిన పోలీసులు అప్పికట్ల వద్ద బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా చోరీకి పాల్పడిన ముఠా అసలు గుట్టు బయటపడింది.
రాజస్థాన్‌కు చెందిన భవరియా గ్యాంగ్ అని పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠా సభ్యులు రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌ఘడ్ జిల్లా టిబ్బి తాలూకా తల్వారాజీల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గ్యాంగ్‌లో సోను, రాజ్‌వీర్, లక్కన్, సీతారాం, వినోద్, మిథున్ అనే ఆరుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో సోనూను అరెస్ట్ చేయగా, అతని ద్వారా మిగిలిన సభ్యుల వివరాలు సేకరించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. కోస్తా జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ఇతర రాష్ట్రాల ముఠాలు వరుస చోరీలకు పాల్పడుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రధాన నిందితుల్లో ఒకరినే పట్టుకుని, మిగిలిన ఐదుగురు ఇంకా పోలీసులకు చిక్కకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

