ఆ హీరో నన్ను పిలిచి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. అంతకన్నా ఏం కావాలి

ఆ హీరో నన్ను పిలిచి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. అంతకన్నా ఏం కావాలి

సుమన్ శెట్టి.. మొన్నటి వరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు , కామెడీ పాత్రల్లో నటించి మెప్పించారు ఈ టాలీవుడ్ నటుడు. గత కొంతకాలంగా సుమన్ శెట్టి సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్నాడు సుమన్ శెట్టి. బిగ్ బాస్ ద్వారా మరోసారి సుమన్ శెట్టి పేరు మారుమ్రోగింది.

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కమెడియన్ సుమన్ శెట్టి. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా చేసి నవ్వులు పూయించారు సుమన్ శెట్టి. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలనూ పాల్గొన్నారు సుమన్. బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సీనియర్ నటులు తమకంటే చిన్నవారిని దూరం పెడతారనే అపోహను నటుడు సుమన్ ఖండించారు. కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన మధుర జ్ఞాపకాలను, సీనియర్ల నుంచి లభించిన మద్దతును ఆయన పంచుకున్నారు. ఈ పరిశ్రమలో మంచి వాతావరణం ఉంటుందని స్పష్టం చేశారు. వేణు మాధవ్ తో అనుబంధం గురించి వివరిస్తూ, రాజమండ్రిలో టి. రాజేందర్ గారి ప్రేమ సాగరం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను సుమన్ గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో తనకు కారవాన్ లేదని, రాజమండ్రి తీవ్రమైన ఎండలో షూటింగ్‌లో పాల్గొంటున్నానని తెలిపారు. ఆ సమయంలో సీనియర్ నటుడైన వేణు మాధవ్ తనను పిలిచి, తన కారవాన్‌లోకి రమ్మని ఆహ్వానించారట. ఎండకు బయట కూర్చోవద్దని, తన కారవాన్‌ను ఉపయోగించుకోవాలని సూచించారని సుమన్ అన్నారు. అంతేకాకుండా, వేణు మాధవ్ ప్రతి ఉదయం ఆనంద్ రెసిడెన్సీ నుండి స్వయంగా క్యారెట్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చేవారని, ఒక తల్లి తన కొడుకును చూసుకున్నట్లే తనను చూసుకున్నారని సుమన్ ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు. ఆలీ, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటులు కూడా షూటింగ్‌లో సరదాగా, మద్దతుగా ఉండేవారని, తనకు ఎప్పుడూ నెగిటివ్ అనుభవాలు ఎదురుకాలేదని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధాన్ని కూడా సుమన్ వివరించారు. తన అభిమాన హీరోలైన పవన్ కళ్యాణ్, వెంకటేష్, మహేష్ బాబులలో పవన్ కళ్యాణ్ మొదటివారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ తో తన మొదటి పరిచయం అన్నవరం సినిమా షూటింగ్ సమయంలో జరిగిందని తెలిపారు. అన్నవరం పెద్దమ్మ తల్లి టెంపుల్ పక్కన షూటింగ్ జరుగుతుండగా, డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్ గారితో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ను సుమన్ కలిశారట. అప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా సుమన్ దగ్గరకు వచ్చి, “హాయ్ సుమన్. నువ్వంటే నాకు ఇష్టం. నేను నీ ఫ్యాన్‌ని. నీ కళ్ళు బాగుంటాయి. నీ జయం సినిమా నేను చూశాను” అని అన్నారని సుమన్ తెలిపారు. తాను ప్రేమించే హీరో తనను అభిమానినని చెప్పినప్పుడు కలిగిన ఆనందం వర్ణించలేనిదని సుమన్ పేర్కొన్నారు. ఈ సంఘటన తన జీవితంలో మరిచిపోలేని గొప్ప ప్రశంస అని ఆయన అన్నారు. అన్నవరం తర్వాత, పవన్ కళ్యాణే స్వయంగా తనను సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు పిలిపించి అవకాశం ఇచ్చారని సుమన్ తెలిపారు. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్, సుమన్‌తో “నువ్వు కొంచెం లావు అవుతున్నావు. మంచి ఆర్టిస్ట్‌వి. కొంచెం తగ్గి, బాడీ తగ్గించు, నువ్వు మంచి ఆర్టిస్ట్‌వి సుమన్” అని ఆరోగ్య సలహా కూడా ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఇంత పెద్ద హీరోలు తన పట్ల చూపిన అభిమానం, మద్దతు తనకెంతో సంతోషాన్ని ఇచ్చాయని సుమన్ అన్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు