రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మధిర సభ రద్దు.

రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మధిర సభ రద్దు.

రైతు భరోసా సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలో రైతు సభ జరగాల్సి ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో ఆ సభను ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో రైతు భరోసా సమావేశం జరగనుంది.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని అన్నదాతలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు అంతా సిద్ధమైంది. మంగళవారం సాయంత్రమే సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లోకి ఈ నిధులను జమ చేయనున్నారు. అయితే ఈ సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం చివరి నిమిషంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలో భారీ ఎత్తున రైతు సభ నిర్వహించి.. అక్కడి నుంచే ఈ పథకం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో సభ నిర్వహణకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో రైతులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మధిర రైతు సభను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది.

హైదరాబాద్ శిల్పకళా వేదికకు మారిన సదస్సు..
మధిరలో బహిరంగ సభ రద్దయినప్పటికీ.. నిధుల విడుదలలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందుకే ఈ సదస్సును తక్షణమే హైదరాబాద్‌కు తరలించారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా సమావేశం జరగనుంది. ఈ సదస్సులోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తారు.

అన్నదాతల్లో హర్షం..
రైతు భరోసా మార్గదర్శకాలపై సుదీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం, అర్హులైన ప్రతి రైతుకూ ఈ సహాయం అందేలా చర్యలు తీసుకుంది. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వానాకాలం సీజన్‌లో ఈ నిధులు ఎంతో ఊరటనివ్వనున్నాయి. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే డీబీటీ ద్వారా నిధుల జమ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు