సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. కానీ ఇప్పుడున్న కాలంలో ఇల్లు కట్టాలంటే లక్షలు కావాల్సిందే. దీంతో చాలా మంది హోమ్ లోన్స్ తీసుకుని ఆ కలను నిజం చేసుకుంటున్నారు. అయితే హోమ్ లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరి జీవితంలో సొంతిల్లు అనేది ఒక పెద్ద కల. ప్రస్తుత కాలంలో ఉన్న స్థలాల ధరలు, నిర్మాణ ఖర్చుల దృష్ట్యా సొంత డబ్బులతో ఇల్లు కట్టడం లేదా కొనడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో మధ్యతరగతి ప్రజలకు ఉండే ఏకైక మార్గం హోమ్ లోన్. బ్యాంకులు అందించే సురక్షితమైన రుణాల్లో హోమ్ లోన్ ఒకటి. క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం, ఉద్యోగం వంటి పలు కీలక అంశాల ప్రాతిపదికన బ్యాంకులు ఈ రుణాలను మంజూరు చేస్తాయి. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్లతో పోలిస్తే.. హోమ్ లోన్స్‌పై బ్యాంకులు చాలా తక్కువ వడ్డీ రేట్లనే వసూలు చేస్తాయి. అయితే లోన్ కాలాం ఎక్కువ ఉండడం వల్ల వడ్డీ రేటులో చిన్న తేడా కూడా మీపై భారీ భారం మోపుతుంది. అందుకే హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఉందో సరిపోల్చుకోవడం చాలా ముఖ్యం. బ్యాంక్ బజార్ తాజా నివేదిక ప్రకారం దేశంలోని ప్రముఖ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు అందిస్తున్న వార్షిక వడ్డీ రేట్ల పూర్తి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
అతి తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న టాప్ బ్యాంకు
ప్రస్తుత మార్కెట్లో ప్రభుత్వ రంగానికి చెందిన కొన్ని బ్యాంకులు అత్యంత తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకుల్లో అత్యంత చౌకగా 7.10శాతం నుంచే వడ్డీ రేటు ప్రారంభమవుతాయి.
కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంకులు 7.15శాతం ప్రారంభ వడ్డీ రేటును కలిగి ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంకులు 7.20శాతం వడ్డీ రేటుతో రుణాలను ఇస్తున్నాయి.
నార్మల్ వడ్డీ రేట్లు కలిగిన బ్యాంకులు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐతో పాటు కొన్ని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ఈ విభాగంలో ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జమ్మూ – కశ్మీర్ బ్యాంకుల్లో 7.25శాతం నుండి వడ్డీ రేట్లు ఉంటాయి.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులు 7.30శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి.
కర్ణాటక బ్యాంక్ ప్రారంభ వడ్డీ రేటు 7.32శాతంగా ఉంది.
ఐడీబీఐ బ్యాంక్ 7.35శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
హెచ్ఎస్బీసీ బ్యాంక్ 7.45శాతం వడ్డీతో హోమ్ లోన్స్ మంజూరు చేస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేట్లు 7.60శాతం నుండి ప్రారంభమవుతాయి.
హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్స్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు 7.75శాతం ప్రారంభ వడ్డీ రేటును కలిగి ఉన్నాయి.
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్: ఇక్కడ వడ్డీ రేటు 7.99శాతంగా ఉంది.
కొన్ని బ్యాంకులు 8శాతం కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయి
కొన్ని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలలో వడ్డీ రేట్లు 8 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి.
టాటా క్యాపిటల్, యాక్సిస్ బ్యాంకులు 8శాతం ప్రారంభ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.
ధనలక్ష్మి బ్యాంకులో వడ్డీ రేటు 8.20శాతం నుండి ప్రారంభమవుతుంది.
బంధన్ బ్యాంకులో 8.41, కరూర్ వైశ్యా బ్యాంకులో 8.50, ఎస్ బ్యాంక్‌లో 8.65 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి.
అయితే బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇదే వడ్డీ రేటు లభించదు. మీ క్రెడిట్ స్కోరు, మీ ఆదాయాన్ని బట్టి బ్యాంకులు వడ్డీ రేట్లను ఫిక్స్ చేస్తాయి. క్రెడిట్ స్కోరు తగ్గేకొద్దీ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. కాబట్టి లోన్ అప్లై చేసే ముందు మీ సిబిల్ స్కోర్‌ను పటిష్టంగా ఉంచుకోండి.

