ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.. కీలక ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లకు సోమవారం సాయంత్రం వరకు డెడ్‌లైన్ విధించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్లు తమ క్లస్టర్ల పరిధిలోని
ప్రధానాంశాలు:
ఏపీలో వాలంటీర్లకు మరో షాకిచ్చారు
సాయంత్రం వరకు సర్కార్ డెడ్‌లైన్
వెంటనే వాటిని తొలగించాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉండే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లను అలర్ట్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశ్యంతో ఆయా క్లస్టర్ సభ్యులతో క్రియేట్ చేసిన వాలంటీర్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను తక్షణమే డిలీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
గత ప్రభుత్వా హయాంలో ఎటువంటి ఆదేశాలు లేకుండానే వాలంటీర్లు స్వయంగా తమ క్లస్టర్ పరిధిలో ఉన్న సభ్యులను చేర్చి వాట్సాప్ గ్రూపులను, టెలిగ్రామ్ గ్రూప్స్‌ను క్రియేట్ చేశారని.. వీటి ద్వారా ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలకు వాటిని వినియోగిస్తున్నారనే ఆరోపణల వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. వెంటనే అటువంటి క్షస్టర్ గ్రూపులను ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల లోపు డిలీట్ చేయాలని ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా అటువంటి గ్రూప్స్ నుంచి తక్షణమే ప్రజలు ఎగ్జిట్ అవ్వాలని.. అందుకు అనుగుణంగా వారికి సచివాలయం సిబ్బంది సిటిజన్స్‌కు అవగాహన కల్పించాలని, స్వతహాగా ఆయా గ్రూప్స్ నుండి ఎగ్జిట్ అయ్యేలా చూడాలని GSWS ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ గ్రూపుల్ని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను కూడా ఆదేశించారు. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు కూడా స్వతహాగా ఈ గ్రూపుల నుంచి బయటకు రావాలని సూచించారు.
ఆయా వలంటీర్ల వాట్సాప్ గ్రూపుల తొలగించిన వివరాలను అధికారులు తనకు సోమవారం ఐదు గంటల లోపు తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రజలను కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలా అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో జిల్లా లోనూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఆ సమాచారాన్ని మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు పంపారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపైనా సమీక్ష చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.. వాలంటీర్ల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునే దిశగా నిర్ణయం తీసుకుంటామంటున్నారు. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ప్రధానంగా వాలంటీర్ల విద్వార్హతలు.. వయస్సుల వారీ వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో పీజీలు, డిగ్రీలు, డిప్లొమా చేసిన వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్, పదో తరగతి చదివిన వారు కూడా ఉన్నారు.
వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోందట. వాలంటీర్ల స్కిల్స్ పెంచి.. వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా సరికొత్త ఆలోచన చేస్తోందట ఏపీ ప్రభుత్వం. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతూనే.. వారి సేవల్ని మరింత మెరుగ్గా వినియోగించుకునేలా ఆలోచన చేస్తోందట. వాలంటీర్ల వ్యవస్థ విషయంలో రాజీనే లేదని.. వారిని కొనసాగిస్తామంటోంది ప్రభుత్వం.. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేసి పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు.