పవన్‌ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

పవన్‌ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీ నేతలు కొందరు కోరడంతో కొత్త చర్చ మొదలయ్యింది. దీనిపై జనసేన నేతలు కూడా స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను కొన్నేళ్లైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. మొత్తానికి ఇరు పార్టీల నేతల స్పందనలతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. డిప్యూటీ సీఎం, సీఎం పదవి చుట్టూ ఏపీలో సరికొత్త రాజకీయం మొదలయ్యింది. ఓ వైపు టీడీపీ నేతలు.. మరో వైపు జనసేన నాయకులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలతో రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh)కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలు కోరడం కొత్త చర్చకు తెరతీశాయి. అటు జనసేనకు చెందిన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ను కొన్నేళ్లైనా ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్‌ ఈ అంశంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమ దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. లోకేష్ ను డిప్యూటీ పదవీలో చూడాలని టిడిపి కేడర్ కోరుకోవడంలో తప్పులేదన్నారు. అదే సమయంలో తాము పవన్ కల్యాణ్ ను సిఎంగా చూడాలని పదేళ్ళగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. పవన్ సిఎం చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.

సీఎం, డిప్యూటీ సీఎం పదవుల విషయంలో ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్ళారో అదే కొనగిస్తే మంచిదని కిరణ్ రాయల్ అన్నారు. అనవసరంగా వైసిపి నేతల మాటలకు ఊపిరి పోయకండిని సూచించారు. వైసీపీలో కొంతమంది జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారు.. వాళ్లకు అవకాశము ఇవ్వవద్దు అన్నారు. పేర్ని నాని, రోజా జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంపై రెండు రోజులుగా డ్రోన్ కెమెరాలు తిరుగడంపై కిరణ్ రాయల్ స్పందించారు. డ్రోన్ కెమెరాలపై 5 మంది అధికారులతో పర్యవేక్షణ కమిటీ వేశారని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ దేశానికి కావలసిన నాయకుడు..అందుకే ఆయనకు భద్రత పెంచాలని కోరారు.

నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి.. హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
కాగా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఎపిసోడ్‌పై హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. అంతా దైవేచ్చ.. లోకేష్‌కు రాసిపెట్టి ఉందేమో.. చూద్దామని అన్నారు. నుదుటి మీద రాసిపెట్టింది ఎవరూ తీయలేరరని వ్యాఖ్యానించారు.

డిప్యూటీ సీఎం చర్చ మొదలైయ్యింది ఇలా..
టీడీపీలోని కీలక నేతలు నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ గళమెత్తుతుండడం ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఇంతకీ.. లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చిందెవరంటే..? సీఎం చంద్రబాబు కడప పర్యటనలో ఆ జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి. ఏపీ రాజకీయాలతో పాటు కూటమి సర్కార్‌లోనూ చర్చనీయాంశం అవుతున్నాయి. యువతకు, తెలుగుదేశం పార్టీకి భరోసా ఇవ్వాలంటే లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని అధినేత చంద్రబాబును శ్రీనివాసరెడ్డి కోరారు.

కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అలా కామెంట్స్‌ చేశారో లేదో.. ఆయన వ్యాఖ్యలకు టీడీపీలోని కీలక నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారు. లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఒక్కొక్కరుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి అన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ.

మరోవైపు… టీడీపీ నేతల కామెంట్స్‌కు మరో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా గొంతు కలిపారు. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ సోమిరెడ్డి కూడా ట్వీట్ చేశారు. పార్టీలో మూడోతరం నాయకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు.. అధినేత చంద్రబాబుకు లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పారు. లోకేష్‌ నాయకత్వానికి ప్రజానీకం జైకొట్టిందని.. అందుకే.. ఆయన పేరును డిప్యూటీ సీఎం రేసులో పరిశీలించాలని కోరుతున్నట్లు ట్వీట్‌లో వివరించారు సోమిరెడ్డి.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు