చైనా పారిశ్రామిక దిగ్గజం, అలీబాబా కంపెనీ సహవ్యవస్థాపకుడు జాక్ మా ఆచూకీ తెలిసింది. గత ఆరు నెలలుగా జాక్ మా జపాన్ రాజధాని టోక్యోలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. టోక్యోలోని గింజా, మారునౌచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత చెఫ్, భద్రతా సిబ్బందితో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. జపాన్ నుంచే తరుచూ అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. స్పెయిన్, నెదర్లాండ్‌లోనూ ఆయన కనిపించినట్లు సమాచారం.
కాగా జాక్ మా టోక్యోకు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్ వ్యవస్థాపకుడు మసయోషి సన్‌కు సన్నిహిత మిత్రుడు. అంతేగాక మసయోషి అలీబాబాలో పెట్టుబడిదారుడు కూడా. జాక్ మా ఒకప్పుడు చైనాలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా, ప్రఖ్యాత పారిశ్రామికవేత్తగా వెలుగొందారు. అయితే ఆ మధ్య చైనా ప్రభుత్వ విధానాలను బహిరంగ వ్యతిరేకించారు. చైనా నియంత్రణలో పనిచేసే ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సరిగా లేదంటూ విమర్శలు గుప్పించారు. బ్యాంకింగ్‌ను నియంత్రించే సంస్థలు కూడా అసమర్ధంగా ఉన్నాయని ఆరోపించారు.
ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో జాక్ మా సంస్థలపై చైనా ఆయన వ్యాపారాలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ గుత్తాధిపత్య విధానాలను అవలంబిస్తున్నాయని నియంత్రణ సంస్థలు జాక్ మా వ్యాపారాలపై విమర్శలు చేశాయి. అప్పటి నుంచి జాక్ మా స్థాపించిన ‘యాంట్’, ‘ఆలీబాబా’ సంస్థలు నిబంధనలు పాటించడం లేదని నోటీసులు ఇవ్వడం ప్రారంభించాయి. ‘యాంట్’ సంస్థ 37 బిలియన్ డాలర్ల ఐపీఓని చైనా ప్రభుత్వం నిషేధించింది. అలాగే, ఆలీబాబా కంపెనీపై 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ప్రభుత్వంతో విబేధాల కారణంగా 2020 ఆయన బహిరంగంగా కనిపించడం మానేశారు. చైనాను వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.