మరో కొత్త వ్యాపారంలోకి డీమార్ట్‌ సైలెంట్‌గా ఎంట్రీ.. భారీ డిస్కౌంట్‌ ఇచ్చే విధంగా ప్లాన్‌..!

మరో కొత్త వ్యాపారంలోకి డీమార్ట్‌ సైలెంట్‌గా ఎంట్రీ.. భారీ డిస్కౌంట్‌ ఇచ్చే విధంగా ప్లాన్‌..!

డీమార్ట్‌ ఈ సరికొత్త ప్రయత్నానికి కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీమార్ట్‌కు 503 స్టోర్లు ఉన్నాయి. ఈ భారీ నెట్‌వర్క్‌ను వాడుకోవడం ద్వారా కస్టమర్లను ఆకర్షించే ఖర్చులు (CAC), అదనపు అద్దెల భారం వంటి సవాళ్లను డీమార్ట్ సులువుగా దాటేయగలుగుతోంది..

రిటైల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపిన ప్రముఖ సూపర్ మార్కెట్ చైన్ ‘డీమార్ట్’ (DMart), ఇప్పుడు సైలెంట్‌గా ఫార్మసీ (వైద్య విక్రయాల) వ్యాపారంలోకి అడుగుపెట్టింది. నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకే అందించే తన సక్సెస్‌ఫుల్ ‘ఎవ్రీడే లో ప్రైసింగ్’ (EDLP) మోడల్‌ను ఇప్పుడు మందుల అమ్మకాల్లోనూ వర్తింపజేస్తోంది. ఇందులో భాగంగా మందులపై ఏకంగా 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తూ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

‘షాప్-ఇన్-షాప్’ వ్యూహం
ఫార్మసీ కోసం విడిగా కొత్త దుకాణాలను ఏర్పాటు చేసి భారీగా పెట్టుబడులు పెట్టే బదులు, డీమార్ట్ ఒక స్మార్ట్ ప్లాన్ వేసింది. తన ప్రస్తుత హైపర్‌మార్కెట్లలోనే కొంత స్థలాన్ని కేటాయించి “షాప్-ఇన్-షాప్” మోడల్‌లో ఫార్మసీ కౌంటర్లను ఏర్పాటు చేస్తోంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) లోని ఎంపిక చేసిన కొన్ని డీమార్ట్ స్టోర్లలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ మెడికల్ కౌంటర్లను ప్రారంభించింది.

ఈ సరికొత్త ప్రయత్నానికి కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీమార్ట్‌కు 503 స్టోర్లు ఉన్నాయి. ఈ భారీ నెట్‌వర్క్‌ను వాడుకోవడం ద్వారా కస్టమర్లను ఆకర్షించే ఖర్చులు (CAC), అదనపు అద్దెల భారం వంటి సవాళ్లను డీమార్ట్ సులువుగా దాటేయగలుగుతోంది.

అనుబంధ సంస్థ ద్వారా నిర్వహణ
ఈ ఫార్మసీ వ్యాపారాన్ని అవెన్యూ సూపర్‌మార్ట్స్ (Avenue Supermarts)కు చెందిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థ రిఫ్లెక్ట్ హెల్త్‌కేర్ అండ్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ (RHRPL) నిర్వహిస్తోంది. డీమార్ట్ సీనియర్ ప్రతినిధి హితేష్ షా దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 2024లో రూ.3.63 కోట్లుగా ఉన్న ఈ సంస్థ ఆదాయం, ఆర్థిక సంవత్సరం 2025 నాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి రూ. 12.92 కోట్లకు చేరింది. అయితే, వ్యాపార విస్తరణ వల్ల నష్టాలు కూడా రూ. 0.69 కోట్ల నుండి రూ. 2.45 కోట్లకు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2026కి సంబంధించిన ఆదాయ వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.

మార్కెట్లో పెరగనున్న పోటీ
సాధారణంగా డీమార్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7-8 శాతంగా ఉంటుంది. కానీ ఫార్మసీ రంగంలో బ్రాండెడ్ జెనరిక్స్ మార్జిన్ 25 నుండి 30 శాతం వరకు, ప్రైవేట్ లేబుల్స్‌కు అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే, 20% డిస్కౌంట్ ఇచ్చినా డీమార్ట్‌కు లాభాలు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, డీమార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక మెడికల్ షాపుల మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే, హోమ్ డెలివరీల కోసం భారీగా క్యాష్ బర్న్ చేస్తూ లాభాల కోసం ఇబ్బంది పడుతున్న ఈ-ఫార్మసీ (ఆన్‌లైన్ మెడిసిన్) యాప్స్‌పై కూడా ఇది మరింత ఒత్తిడిని పెంచనుంది.

సవాళ్లు కూడా ఎక్కువే..
డీమార్ట్ ఎంట్రీ మార్కెట్లో ఆసక్తి రేపుతున్నప్పటికీ, హెల్త్‌కేర్ రంగంలో ఈ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందనే దానిపై పరిశ్రమ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థైరోకేర్ (Thyrocare) మేనేజింగ్ డైరెక్టర్ అండ్‌ సీఈఓ రాహుల్ గుహా దీనిపై స్పందిస్తూ కొన్ని కీలక సవాళ్లను లేవనెత్తారు.

భారీ ఇన్వెంటరీ నిర్వహణ: నిత్యావసర వస్తువులలా కాకుండా, ఫార్మసీ రంగంలో స్థానిక ప్రిస్క్రిప్షన్ల డిమాండ్‌ను అందుకోవడానికి ఒక సాధారణ మెడికల్ స్టోర్ కూడా ఎప్పుడూ 4,000 నుండి 5,000 రకాల మందులను అందుబాటులో ఉంచాలి.
తక్కువ మార్జిన్ రిస్క్: 20% ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు, చిన్న పొరపాటు జరిగినా వ్యాపార నిర్వహణ కష్టమవుతుంది.
సరఫరాదారుల నెట్‌వర్క్: ఎఫ్‌ఎమ్‌సిజి (FMCG) రంగానికి భిన్నంగా, ఫార్మా రంగంలో దాదాపు 50 నుండి 60 వేర్వేరు తయారీదారులతో డీల్ చేయాల్సి ఉంటుంది.
వ్యాపార విస్తరణలో డీమార్ట్ ఎప్పుడూ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ ఫార్మసీ బిజినెస్‌ను కూడా దేశవ్యాప్తంగా దశలవారీగా, నెమ్మదిగా విస్తరించే యోచనలో కంపెనీ ఉంది. క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి పోటీ పెరుగుతున్న తరుణంలో ఎక్కువ మార్జిన్లు ఉండే ఫార్మసీ రంగాన్ని డీమార్ట్ ఎంచుకోవడం రిటైల్ మార్కెట్లో ఎలాంటి మార్పులకు కారణమవుతుందో చూడాలి.

Please follow and like us:
బిజినెస్ వార్తలు