స్టింగ్ డ్రింక్‌పై నిషేధం.. పాఠశాలల పరిసరాల్లో కనిపించకూడదంటూ ప్రభుత్వ ఆదేశాలు!

స్టింగ్ డ్రింక్‌పై నిషేధం.. పాఠశాలల పరిసరాల్లో కనిపించకూడదంటూ ప్రభుత్వ ఆదేశాలు!

పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్‌తో పాటు ఇలాంటి పానీయాల విక్రయాన్ని నిషేధించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, ప్రభుత్వం చేపట్టనున్న చర్యలు ఏంటో తెలుసుకోండి.

పిల్లల ఆరోగ్యంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్‌తో పాటు ఇలాంటి ఎనర్జీ పానీయాలను పాఠశాలల 500 మీటర్ల పరిధిలో విక్రయించడాన్ని నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆహార, ఔషధ పరిపాలన (FDA) అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ మంత్రి నర్హరి జిర్వాల్ వెల్లడించారు. మహారాష్ట్ర శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ పచ్‌పుటే అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. పాఠశాల విద్యార్థులు అధికంగా ఎనర్జీ డ్రింక్స్‌ను వినియోగిస్తున్నారనే ఆందోళనలు, వాటి వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎనర్జీ డ్రింక్స్‌లో సాధారణంగా కెఫీన్, చక్కెర అధిక మోతాదులో ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల పిల్లల్లో గుండె వేగం పెరగడం, నిద్రలేమి, ఆందోళన, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇటువంటి పానీయాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడం కూడా అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. “పాఠశాల ప్రాంగణంలో లేదా 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ లేదా ఇతర ఆరోగ్యానికి హానికరమైన మత్తు పదార్థాల అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే, బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి నర్హరి జిర్వాల్ స్పష్టం చేశారు.

చర్చ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమ్ పచ్‌పుటే 18 ఏళ్లలోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ విక్రయాన్ని పూర్తిగా నిషేధించేలా ప్రత్యేక నిబంధనలు తీసుకొస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే ఎమ్మెల్యేలు రాహుల్ కుల్, వరుణ్ సర్దేశాయ్ కూడా పిల్లలకు ఇలాంటి పానీయాలు సులభంగా అందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి జిర్వాల్, పాఠశాలల సమీపంలో నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయడమే కాకుండా, ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాఠశాలల సహకారంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు