గ్యాస్ డెలివరీ చేయడంలో ప్రస్తుతం ఆలస్యం జరుగుతోంది. గతంలో బుక్ చేసుకున్న తర్వాత డెలివరీకి రెండు లేదా మూడు రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు వారంపైనే సమయం అనేది పడుతుంది. అయితే డెలివరీ కాకపోతే ఎన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేయవచ్చంటే..?
గ్యాస్ సరఫరాలో అంతరాయాలు, కొరత వల్ల ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో గ్యా్స్ బుక్ చేసుకున్న రెండు, మూడు రోజులకు ఇంటికి డెలివరీ అయ్యేది. కానీ ఇప్పుడు వారం రోజులపైబడి సమయం పడుతుంది. గ్యాస్ డెలివరీ చేయడంలో ఆలస్యానికి చింతిస్తున్నామంటూ గ్యాస్ కంపెనీలు ఎస్‌ఎంఎస్‌లు కూడా వినియోగదారులకు పంపుతున్నాయి.
ఆలస్యం కావడం వల్ల చాలామంది గ్యాస్ ఏజెన్సీలు, గ్యాక్ కంపెనీలకు కాల్ చేసి అడుగుతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలామంది అలాగే ఉండిపోతున్నారు. అయితే గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు డెలివరీ రాకపోతే ఫిర్యాదు చేయవచ్చు? అనే విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. దీనికి సంబంధించి నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
నగరాలు, పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ డెలివరీకి తక్కువ సమయం పడుతుంది. ఇక మారుమూల గ్రామాలకు అయితే ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా బుక్ చేసిన 2 నుంచి 7 రోజుల్లోపు డెలివరీ చేస్తారు. అయితే ప్రాంతం, ఏజెన్సీ సేవ, డిమాండ్‌ను బట్టి సమయం అనేది మారుతుంది. పట్టణాల్లో అయితే 2 నుంచి 4 రోజుల్లో డెలివరీ పొందే అవకాశముంటుంది. కానీ ఇటీవల గ్యాస్ కొరత వల్ల 7 రోజులకు మించి జాప్యం జరుగుతుంది.
నిబంధనల ప్రకారం 7 రోజుల్లోగా డెలివరీ అవ్వకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా మీకు గ్యాస్ డెలివరీ చేసే ఏజెన్సీని సంప్రదించాలి. ఏజెన్సీ, డిస్ట్రిబ్యూటర్ స్థాయిలోనే సమస్య దాదాపు పరిష్కారం అవుతుంది. అప్పటికి అవ్వకపోతే మీ గ్యాస్ కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్, వెబ్ సైట్, వాట్సప్ సేవల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు
ఇక కంపెనీ ద్వారా కూడా మీ సమస్య పరిష్కారం అవ్వకపోతే కేంద్ర ప్రజా ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే సంబంధింత వినియోగదారుల ఫిర్యాదు సంస్థ నుంచి కూడా సహాయం పొందవచ్చు. 7 రోజుల తర్వాత మీరు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే ఎక్కువ ఆలస్యం చేయకండి.

