ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఇవే! భారత్ స్థానం ఎంతంటే?

ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఇవే! భారత్ స్థానం ఎంతంటే?

భారత ప్రభుత్వం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. దేశంలో పెరుగుతున్న డిమాండ్, దిగుమతులపై అధిక ఆధారపడటంతో DGFT కొన్ని వెండి ఉత్పత్తులను ‘లిమిటెడ్‌’ కేటగిరీలోకి మార్చింది. ప్రపంచంలో పెరు అత్యధిక వెండి నిల్వలు కలిగి ఉండగా, భారత్ 10వ స్థానంలో ఉంది. అధిక వినియోగం, తక్కువ నిల్వల కారణంగా, భారత్ తన అవసరాల్లో 80-90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది.

భారత ప్రభుత్వం ఇటీవల వెండి దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (DGFT) కొన్ని వెండి ఉత్పత్తుల దిగుమతులను ఫ్రీ కేటగిరీ నుంచి లిమిటెడ్‌ కేటగిరీలోకి మార్చుతూ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో వెండికి పెరుగుతున్న డిమాండ్, పారిశ్రామిక అవసరాలు, దిగుమతులపై అధిక ఆధారపడటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు కలిగిన దేశాల జాబితా మళ్లీ చర్చనీయాంశమైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దక్షిణ అమెరికా దేశమైన Peru ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన దేశంగా నిలిచింది. అక్కడ సుమారు 1,40,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నట్లు అంచనా.

రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఈ దేశంలో సుమారు 94,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నాయి. మూడో స్థానంలో రష్యా నిలిచింది. అక్కడ దాదాపు 92,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నట్లు USGS వెల్లడించింది. ఈ జాబితాలో తదుపరి స్థానాల్లో చైనా (70,000 మెట్రిక్ టన్నులు), పోలాండ్‌ (61,000 మెట్రిక్ టన్నులు), మెక్సికో (37,000 మెట్రిక్ టన్నులు), చీలీ (26,000 మెట్రిక్ టన్నులు), అమెరికా (23,000 మెట్రిక్ టన్నులు), బోలివియా (22,000 మెట్రిక్ టన్నులు) ఉన్నాయి.

ఆశ్చర్యకరంగా ప్రపంచంలో వెండిని అత్యధికంగా వినియోగించే దేశాల్లో ఒకటైన ఇండియా ఈ జాబితాలో 10వ స్థానంలో మాత్రమే ఉంది. భారతదేశంలో సుమారు 8,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నట్లు అంచనా. కానీ దేశీయ అవసరం మాత్రం సంవత్సరానికి 6,000 నుంచి 7,000 టన్నుల వరకు ఉంటుంది. పరిమిత నిల్వల కారణంగా భారత్ తన వెండి అవసరాల్లో 80 నుంచి 90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా యూకే, హాంకాంగ్‌ వంటి ప్రాంతాల నుంచి భారీగా వెండి దిగుమతులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వం దిగుమతుల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు