అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం చింతావారిపేట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రాణాలతో బయటపడ్డాడు.
విహారయాత్ర విషాదంగా మారింది. విహారయాత్రకు వెళ్లి సరదాగా గడిపిన కుటుంబ సభ్యులు ఇంటికి చేరకుండానే విగతజీవులుగా మారిపోయారు. ప్రమాదంలో కుటుంబంలోని ముగ్గురు చనిపోయిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది..
పోతవరానికి చెందిన విజయ్ కుమార్… భార్య, ఇద్దరు కుమారులతో కలిసి అరకు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపి తిరిగి సోమవారం రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. రావులపాలెం మండలం ఈతకోట వద్దకు వచ్చేసరికి విజయ్ కుమార్.. నిద్రమత్తుతో కళ్లు మూతలు పడుతున్నాయని కారు రోడ్డు పక్కన ఆపాడు. భార్య ఉమ నాకు డ్రైవింగ్ వచ్చు కదా ఇంకా పది కిలోమీటర్ల దూరంలో ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పింది.
దీనికి భర్త సరే అని అనగా… భార్య ఉమ కార్ డ్రైవింగ్ చేస్తూ పోతవరం బయలుదేరారు. కారు ఊడిముడి వచ్చిన తర్వాత అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో భార్య ఉమ, ఇద్దరు కుమారులు మనోజ్, రిషి మృతి చెందగా… భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. మరో ఐదు కిలోమీటర్ల దూరంలో స్వగ్రామం చేరుకుంటారనే సమయంలో వారంతా శవాలుగా మారడం అందర్ని కలచివేసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు . తన కళ్లముందే భార్యాపిల్లలు. కొట్టుకుపోయారని విజయ్‌కుమార్ బోరున విలపించారు.