ఏపీకి వరుసగా అల్పపీడన ముప్పులు పొంచి ఉన్నాయి. ఈ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. మరి ఆ వివరాలు ఇలా..
ఏపీ, తమిళనాడుకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉంది. డిసెంబర్ 11 నాటికి శ్రీలంక తమిళనాడు తీరానికి అల్పపీడనం సమీపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
అటు తెలంగాణకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఎఫెక్ట్ చెన్నైలోనూ వర్షాలు పడుతున్నాయి. డిసెంబర్ 15 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని కొన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది ఐఎండీ. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అలాగే డిసెంబర్ 17న అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది.