సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ నటించిన అద్భుతమైన చిత్రాలు అనేకం. ప్రస్తుతం సహాయ నటుడిగా వరుస సినిమాలతో అలరిస్తున్న ఆయన.. ఒకప్పుడు హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు.. కడుపుబ్బా నవ్వించే సినిమాల్లో నటించారు.
సినీరంగంలో అద్భుతమైన దృశ్య కావ్యాలను తెరకెక్కించడంలో దర్శకులు బాపు రమణలు సిద్ధహస్తులు. వాస్తవానికి దగ్గరగా.. హృదయానికి హత్తుకునేలా చిత్రాలను రూపొందించడంలో వీరిద్దరు నేర్పులు. ప్రతి కథను ఎంతో హృద్యంగా తెరకెక్కిస్తారు. అందమైన చిత్రాలను వెండితెరపై ఆవిష్కరించడంలో వీరు నేర్పరులు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో దాదాపు 50 చిత్రాలకు పైగా తెరకెక్కించారు బాపు. ఆయన దర్శకత్వం వహించిన అద్భుతమైన చిత్రాల్లో పెళ్లి పుస్తకం ఒకటి. 1991లో ఏప్రిల్ 1న విడుదలైన ఈ సినిమాకు మంచి విజయం అందుకుంది. బాపు గీత గీసి, ముళ్లపూడి వెంకటరమణ రాత రాసి శ్రీకారం చుట్టిన చిత్రం ఇది. ఇందులో రాజేంద్రప్రసాద్, దివ్యవాణి ప్రధాన పాత్రలు పోషఇంచారు. అయితే బాదం ఆకులు లేవని ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని మీకు తెలుసా.. ?
స్క్రిప్టులో రాధాకుమారి, సాక్షి రంగారవు బాదం ఆకుల విస్తర్లలో ఇడ్లీలు తింటూ మాట్లాడుకుంటున్నట్లు రమణ రాశారు. షాట్స్ రాసినప్పుడు దర్శకుడు బాపు కూడా అదే రాసి.. బాదం ఆకుల విస్తర్లు కావాలి అని ప్రొడక్షన్ వాళ్లకి రాసి ఇచ్చారట. ఉదయం షూటింగ్ స్టార్ట్ అయ్యింది.. కానీ బాదం ఆకులు దొరకలేదని… మామూలు విస్తరాకులు తెచ్చారట ప్రొడక్షన్ వాళ్లు. బాదం ఆకులు దొరక్కపోవడం ఏంటీ.. ? పొద్దున్నే రాసి ఇచ్చారు కదా.. బాదం ఆకుల విస్తర్లే కావాలి. వెళ్లి తీసుకురండి. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎవరింట్లోనూ బాదం చెట్టు లేదా? అని కసిరి పంపించారట బాపు. అవి వచ్చేవరకు షూటింగ్ లేదని అన్నారట.
దీంతో బాదం ఆకుల కోసం రెండు కార్లలో వెతుకుంటూ తిరిగారట. చివరకు చిక్కడపల్లిలో ఒకరింట్లో బాదం చెట్టు ఉందని ఎవరో చెబితే అక్కడకు వెళ్లి ఆకులు కోసి తెచ్చి.. విస్తర్లు కుట్టి ఇచ్చేసరికి మధ్యాహ్నం అయ్యిందట. అయితే అప్పటికే ఇడ్లీలు చల్లారిపోయాయట. దీంతో మళ్లీ ఇడ్లీలు తెప్పించి సీను షూట్ చేశారట. కానీ సినిమా పూర్తయ్యాక నిడివి ఎక్కువైందని ఈ బాదం ఆకుల సన్నివేశాన్ని సైతం కట్ చేశారట.