ప్రపంచదేశాలు భాగ్యనగరం వైపు చూసేలా చేస్తామన్న సీఎం రేవంత్.. ఇంతకు సర్కార్ యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి…?

ప్రపంచదేశాలు భాగ్యనగరం వైపు చూసేలా చేస్తామన్న సీఎం రేవంత్.. ఇంతకు సర్కార్ యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి…?

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగానూ మారుస్తానంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే రూ. 5,942 కోట్లు నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు.

నార్త్‌ టు సౌత్‌.. సిటీలన్నీ సమస్యలకు కేరాఫ్ అడ్రస్. ఆర్థిక రాజధాని నుంచి మొదలుకుని దేశ రాజధాని వరకు నగరాలన్నీ నరకప్రాయమే. ఏ సిటీ చూసినా ఏమున్నది గర్వకారణమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ హైదరాబాద్‌ నగరాన్ని మాత్రం అందరూ గర్వపడేలా తీర్చిదిద్దుతానన్నారు. ప్రపంచదేశాలు భాగ్యనగరం వైపు చూసేలా అంతర్జాతీయ నగరంగా మారుస్తానన్నారు. ఇంతకు ప్రభుత్వం యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి…? గ్రేటర్‌ హైదరాబాద్‌ను గ్రేటెస్ట్‌గా ఎలా మారుస్తారు…?

ఏ దేశమైనా హైదరాబాద్‌ను ఓ రోల్‌ మోడల్‌గా తీసుకోవాలంటోంది అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం.హైదరాబాద్‌ని అంతర్జాతీయ నగరంగా మార్చడమే ధ్యేయంగా ముందుకెళ్తోంది. అందులోభాగంగానే.. హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ ప్రాజెక్టులో భాగంగా పలు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు, రోడ్ల విస్తరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 5,942 కోట్ల రూపాయల నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే టెండర్లు పిలిచి ఈ నిధులతో పనులను చేపట్టనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరు జోన్లలో 5 ప్యాకేజీల కింద పనులను చేపట్టనున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ జోన్‌లోని ఏవోసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం కోసం అత్యధికంగా 940 కోట్ల రూపాయలు విడుదలకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. శేరిలింగంపల్లి జోన్‌లో ఖాజాగూడ, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల అభివృద్ధికి రూ. 837 కోట్లు, మియాపూర్‌ ఎక్స్ రోడ్డు నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వరకు ఆరు వరుసల ప్లైఓవర్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు మూడు వరుసలతో అండర్ పాస్ నిర్మాణానికి రూ.530 కోట్లు విడుదల చేసింది. ఇటు ఖైరతాబాద్ జోన్ పరిధిలో రేతిబౌలి నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకు మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.398 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగానూ మారుస్తానంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న డీజిల్ బస్సులు, ఆటోలను ఔటర్ రింగు రోడ్డు అవతలికి పరిమితం చేస్తామని తెలిపారు. రానున్న రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొత్తంగా… మరికొన్ని సంవత్సరాల్లో నయా హైదరాబాద్‌ను చూస్తారంటున్నారు సీఎం రేవంత్. అన్నివిధాలా అభివృద్ధి చేస్తూ… ప్రపంచదేశాలు హైదరాబాద్‌వైపు చూసేలా చేస్తామంటున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు