ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. ఓ బాలుడు భిక్షాటన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎక్స్ వేదికగా లోకేష్ పోస్ట్ చేశారు. ఆ వీడియో చూడగానే తన గుండె తరుక్కుపోయిందన్న మంత్రి వెంటనే బాలుడిని సంరక్షిస్తామని, ఆ పని చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు..
బాల్యం ఒక వరం.. ఎలాంటి బాధలు, బాధ్యతలు లేకుండా సాఫీగా సాగిపోవాల్సిన సమయం. అందుకే జీవిత ప్రయాణంలో బాల్యాన్నే ప్రతీ ఒక్కరూ ఎంతో ఇష్టపడుతుంటారు. అయితే అందరికీ బాల్యం ఇలాగా అందంగా ఉంటుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. విధి వెక్కిరించడమో, తల్లిదండ్రుల పొరపాటే కారణం ఏదైనా.. సంతోషంగా సాగాల్సిన బాల్యం కష్టాలమయం అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుకున్న ఓ సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దీనిపై ఏకంగా మంత్రి నారా లోకేష్ స్పందించారు.
వివరాల్లోకి వెళితే.. ఆడుతూ పాడుతూ జీవించాల్సిన ఓ పసి బాలుడి దుస్థితిని చూసి మంత్రి నారా లోకేశ్ చలించిపోయారు. కర్నూలులో రోడ్డు పక్కన యాచిస్తూ దయనీయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి.. మంత్రి లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ పోస్టు చేశారు. సంతోష్ కుమార్ అనే ఓ నెటిజన్ భిక్షాటనం చేస్తున్న ఓ చిన్నారి వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.
కనీసం ఐదేళ్లు కూడా నిండని ఓ కుర్రాడికి ఒంటి నిండా సిల్వర్ కలర్ పూసి రోడ్డు పక్కన కూర్చొబెట్టారు. అయితే ఆ సమయంలో చిన్నారికి నిద్ర రావడంతో కునుకుపాట్లు తీస్తూ కనిపించాడు. దీనంతటినీ వీడియోగా తీసి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు సంతోష్ కుమార్.
ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్‌గా ట్యాగ్ చేస్తూ.. కర్నూలు పట్టణంలో డ్రస్ సర్కిల్ షాపింగ్ మాల్‌కు సమీపంలో ఓ చిన్నారితో బిక్షాటనం చేయిస్తున్నారు. కుర్రాడిని బాగా హింసిస్తూ చివరికి భోజనం కూడా అందించకకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఓ పోస్ట్ చేశారు. దీంతో ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు.
ఈ సంఘటన చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని, భద్రత ప్రతీ చిన్నారి హక్కు అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఆ చిన్నారిని గుర్తించి రక్షణ కల్పిస్తామని, తామే స్వయంగా ఆ బుడ్డొడి రక్షణకు జవాబుదారిగా ఉంటామని స్పందించారు. అలాగే బాలుడి దుస్థికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు.