తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ.. తెలంగాణలో 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ.. తెలంగాణలో 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో టెంపరేచర్స్‌ ఇప్పటికే 44 డిగ్రీలు దాటగా.. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటు.. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించడం భయపెడుతోంది.

మే ఎండలు ఏప్రిల్‌లోనే కాస్తున్నాయి. సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. నిన్నమొన్నటివరకు అకాల వర్షాలతో కాస్త బ్రేక్‌ ఇచ్చినా.. మళ్లీ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 9, 10 గంటలకే ఎండలు ప్రతాపం చూపుతుండగా.. మధ్యాహ్నం వేళల్లో నిప్పుల కుంపటిని తలపిస్తు్న్నాయి. ఫలితంగా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతోపాటు.. నేటి నుంచి నాలుగు రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే.. తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జాబితాలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరం భీమ్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. అయితే.. మండే ఎండలతోపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ఇవాళ, రేపు వేడి గాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక.. నిన్న ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీలు, నిజామాబాద్-44, మెదక్ 42.8, రామగుండం 42.3, మహబూబ్‌నగర్ 41.2, ఖమ్మం 41, హనుమకొండ 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం 33 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగానే టెంపరేచర్స్‌ రికార్డ్‌ అయ్యాయి.

ఏపీలో రోజు రోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఏపీలోనూ ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లా గోనవరంలో రికార్డ్‌ స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఈ సీజన్‌లో ఇదే హై టెంపరేచర్‌ అని వాతావరణ శాఖ తెలిపింది. అటు.. ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 43.8 డిగ్రీలు, వైయస్సార్ కడప జిల్లా మద్దూరులో 43.6డిగ్రీలు, కర్నూలు జిల్లా తోవిలో 42.9 డిగ్రీలు, పల్నాడు జిల్లా నర్మలపాడులో42.8 డిగ్రీలు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్‌ అయ్యాయి. ఏపీ వ్యాప్తంగా 135 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తంగా.. ఏపీ, తెలంగాణలో భానుడు ఓ రేంజ్‌లో ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు