పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. గజ్వేల్‌లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగుచూసింది. శిశువులు ఆరోగ్యంగా ఉన్నారన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి…
పెళ్లయిన 8 ఏళ్ల అనంతరం దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో ఇక ఆ ఇంట ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఈ అరుదైన ఘటన సంగారెడ్డి జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. తమకు వివాహమై ఎనిమిదేళ్లయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఆ దంపతులు తీవ్ర నైరాశ్యానికి లోనయ్యారు. ఇప్పుడు ఏకంగా ముగ్గురు పండంటి బిడ్డలు జన్మించడంతో ఆ దంపతులు ఆనందం అంతా ఇంతా కాదు.
వివరాల్లోకి వెళ్తే…సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని అడవి మసీదు గ్రామానికి చెందిన నాగరత్న – నర్సింహులుకు మ్యారేజ్ అయి 8 ఏళ్లు అవుతుంది. వివాహం అయ్యి ఇన్నేళ్లు అవుతున్నా.. సంతానం కలగకపోవడంతో వారు మనో వేదలో ఉన్నారు. అయితే IVF పద్ధతిలో సంతానం కలుగుతుందని తెలుసుకున్న నాగరత్న ఓ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అనంతరం గజ్వేల్‌లో ఉన్న జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఆమె వచ్చి రెగ్యులర్ చెకప్, స్కానింగ్‌లు చేయించుకునేవారు.. అలా క్రమం తప్పకుండా మూడో నెల నుంచే చెకప్‌లు చేయించుకున్నారు.
ఈ క్రమంలో నెలలు నిండిన తర్వాత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరత్న ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఆమె గర్భంలో ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం తక్కువగా ఉండటంతో.. సిజేరియన్ చేశారు. నాగరత్నకు ఓ ఆడబిడ్డ, ఇద్దరు మగబిడ్డలు పుట్టారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణ తెలిపారు.