ఓవైపు ఎండ కుమ్ముతోంది.. మరోవైపు వాన దంచుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రమైన వాతావరణం

ఓవైపు ఎండ కుమ్ముతోంది.. మరోవైపు వాన దంచుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో చిత్రమైన వాతావరణం

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షం. తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కపోత పెరుగుతోంది. దంచికొడుతోన్న వర్షాలూ తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. అప్పటివరకు మాడు పగిలేలా ఎండ కాస్తుంది. అంతలోనే మబ్బులు కమ్మేసి వర్షం పడుతోంది. తాజా వెదర్ రిపోర్ట్ మీ కోసం..

పొద్దంతా ఎండా..రాత్రి వాన దంచికొట్టింది. హైదరాబాద్‌ వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌..కూకట్‌పల్లి, మియాపూర్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉప్పొంగిన వరదతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది.కూకట్‌పల్లి, కె.పి.హెచ్.బి కాలనీ, మియాపూర్, కొండాపూర్ గాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. వరదతో మ్యాన్ హోల్స్ ఉప్పొంగాయి, ట్రాఫిక్‌ జామ్‌లో వాహనదారులకు చుక్కలు కన్పించాయి.

హైదరాబాద్ సహా గద్వాల, మల్కాజ్‌గిరి, నల్గొండ..సంగారెడ్డి, వికారాబాద్‌ లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుందని పేర్కొంది వాతావరణ శాఖ. గాలుల ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రకటించింది. అటు ఏపీలో గాలి వాన బీభత్సం సృష్టిస్తోంది. శ్రీకాకుళంలో గాలుల ధాటికి అనేక చోట్ల చెట్లు , విద్యుత్‌ స్తంభాలు కూలాయి. కరెంట్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఏపీలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఏపీ వ్యాప్తంగా 144 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి వుండే అవకాశం వుంది. రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపినఅవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉత్తర, దక్షిణ ద్రోణి బలహీనపడింది. రాగల మూడు రోజులు కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. పగటి పూట 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యే సరికి ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అంచనా ప్రకారం రుతుపవనాలు మే 27న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది.నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సంవత్సరం సాధారణ స్థాయి కంటే ఎక్కువ వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు