భారత్‌పై 25 శాతం సుంకం విధించాలనే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ప్రధానంగా ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తులపై దీన్ని ప్రభావం భారీగా పడనుంది. ప్రస్తుతం ఆపిల్ ముందు ఒకటే మార్గం ఉంది. పన్నులను భరించడం లేదా ఐఫోన్ల ధరలను పెంచడం.
డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 25 శాతం పన్నులు విధించారు. దీంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ నిర్ణయం భారత్‌ను అమెరికాకు ఐఫోన్ ఎగుమతి కేంద్రంగా మార్చాలనే ఆపిల్ ఆశయానికి గండి కొట్టొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆపిల్ ఇప్పటివరకు దేశంలో తయారు చేసిన అన్ని ఐఫోన్ మోడళ్లపై అమెరికా 25 శాతం సుంకాన్ని విధిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో దేశంలో ఆపిల్ ఉత్పత్తుల తయారీ, ఎగుమతి ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
భారత్‌లో ఆపిల్‌కు 55 శాతం వాటా..
భారత ఎగుమతులపై 25 శాతం సుంకం.. దేశాన్ని అమెరికాకు ప్రధాన ఐఫోన్ ఎగుమతి కేంద్రంగా మార్చాలనే ఆపిల్ ప్రణాళికను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని ఐడీసీ ఇండియా డివైస్ రీసెర్చ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవకేంద్ర సింగ్ అన్నారు. ఐడీసీ ప్రకారం.. ఆపిల్ యొక్క ఐఫోన్ షిప్‌మెంట్‌లలో అమెరికా 25 శాతం వాటాను కలిగి ఉంది. ఇది ఏడాదికి దాదాపు రూ. 6 కోట్లు. కానీ ఇప్పుడు ఎగుమతులు సుంకాల కారణంగా ఆపిల్ పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కోవచ్చు. ఇప్పటివరకు ఆపిల్ తన విస్తృత చైనా-ప్లస్-వన్ వ్యూహంలో భాగంగా దేశంలో ఫాక్స్‌కాన్ ద్వారా ఐఫోన్ ఉత్పత్తిని పెంచుతోంది. గత కొన్ని నెలల్లో అమెరికాకు వెళ్లిన ఐఫోన్‌లలో సగం భారతదేశంలో తయారు చేసినవే కావడం గమనార్హం. భారత్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఆపిల్ 55 శాతం వాటాను కలిగి ఉంది.
ఆపిల్ నెక్ట్స్ స్టెప్?
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా ప్రకారం.. ఆపిల్ విధాన మార్పులపై నిఘా ఉంచుతూ షిప్‌మెంట్‌లను కొనసాగించవచ్చు. ‘‘టారిఫ్‌ల ప్రభావాన్ని ఆపిల్ స్వయంగా భరిస్తుంది లేదా టారిఫ్‌ల కారణంగా పెరిగిన ధరలను వినియోగదారుల నుంచి వసూల్ చేసే అవకాశం ఉంది. ఆపిల్ ఇప్పటికే పెరుగుతున్న కాంపోనెంట్ ఖర్చులతో ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా టీఎస్ఎంసీ కొత్త 3nm చిప్ ధరనే దీనికి ప్రధాన కారణం. కాబట్టి వారు ఖర్చులను తగ్గించుకోవాలి లేదా ధరలను పెంచాలని’’ నీల్ షా అభిప్రాయపడ్డారు.
భారత్ నుండి ఎగుమతి ఎంత..?
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆపిల్ భారత్ నుంచి నుండి 5 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. ఇది దేశం యొక్క మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో జరిగిన దాదాపు 3 బిలియన్ డాలర్ల ఎగుమతుల కంటే ఇది చాలా ఎక్కువ. ఆపిల్ సంస్థకు ఒకటే మార్గం.. అమెరికాలో ఫోన్ల ధరలను పెంచడం లేదా పన్నులను తగ్గించడం.