రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ కూడా విడుదల చేసింది. ఇక ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నట్లు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ కూడా విడుదల చేసింది. ఇక ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ఇప్పటికే వచ్చిన పరీక్ష ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్ ఆధారంగా మొత్తం విద్యార్దులు సంఖ్యను తెలిపింది. దాదాపుగా ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రభుత్వ పరీక్షల విభాగం తుది జాబితాను తాజాగా రూపొందించింది. టైం టేబుల్ ప్రకారం టెన్త్ పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్నాయి.
కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 33,930 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఆ తర్వాత స్థానంలో అనంతపురం జిల్లా ఉంది. ఈ జిల్లా నుంచి 31,979 మంది టెన్త్ విద్యార్ధులు పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారు. అలాగే మొత్తం విద్యార్థుల్లో ఈ ఏడాది దాదాపు 94 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాయనున్నారు. ఇక తెలుగు మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. 2024లో 1.61లక్షల మంది తెలుగు మీడియంలో పరీక్షలు రాయగా, 2025లో కేవలం 51 వేల మంది మాత్రమే మాతృభాషలో పరీక్షలు రాశారు. 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 32 వేల మంది మాత్రమే పదో తరగతి పరీక్షలు రాస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్న నేపథ్యంలో అధిక మంది విద్యార్ధులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం అనధికారికంగా తెలుగు మీడియం నిర్వహిస్తున్నారు.
పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో మార్కుల లెక్కింపులో తప్పులు లేకుండా ఉండేందుకు ఈ సారి ట్యాబ్ల ద్వారా మార్కులు నమోదు చేయనున్నట్లు సమాచారం. అసిస్టెంట్ ఎగ్జామినర్ నమోదు చేసిన మార్కులను చీఫ్ ఎగ్జామినర్ పరిశీలిస్తారు. గత పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మార్కుల కూడికలు, నమోదులో తప్పులు వెలుగు చూడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

