సినిమాలపై వంద శాతం టారిఫ్.. ట్రంప్ ప్రకటనపై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్

సినిమాలపై వంద శాతం టారిఫ్.. ట్రంప్ ప్రకటనపై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్

గత కొన్ని రోజులుగా సుంకాలతో భారత్ కు వరుస షాక్ లు ఇస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో రిలీజయ్యే ఇండియన్ సినిమాలపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తెలుగు సినిమాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు మంగళవారం (సెప్టెంబర్ 29) ట్రంప్ షాకింగ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో నిర్మించే చిత్రాలకు మాత్రం ఆయన మినహాయింపు ఇచ్చారు. ట్రంప్‌ నిర్ణయంతో తెలుగు సినిమాలపై కూడా టారిఫ్‌ ఎఫెక్ట్‌ పడనుంది. దీని ప్రకారం అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్‌ సినిమాలు వందశాతం టారిఫ్‌ చెల్లించాల్సి ఉంది. ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుంచి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్‌తో కాలిఫోర్నియా తీవ్రంగా నష్టపోయింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి నిర్ణయంతో తెలుగు సినిమాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్ట్ ట్రంప్‌ సుంకాల నిర్ణయంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా అతను ఒక పోస్ట్ పెట్టాడు.

‘అంతర్జాతీయ చట్టాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ సుంకాలు అమలు చేయడం సాధ్యం కాదు. బెర్మన్ సవరణ చట్టం ప్రకారం సినిమాలపై దిగుమతి సుంకాలను పూర్తిగా అడ్డుకోవచ్చు. ఈనెల 29న ఇచ్చిన ట్రంప్ ఆదేశాలపై చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కొవాలి ‘ అని నిఖిల్ ట్వీట్ లో రాసుకొచ్చారు.

హీరో నిఖిల్ ట్వీట్..

ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాలో చివరిసారిగా కనిపించాడు. ప్రస్తుతం అతను స్వయంభూ అనే ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. సంయుక్తా మేనన్, నభా నటేష్ ఈ మూవీలో కథానాయికలుగా నటిస్తున్నారు. దీంతో పాటు రామ్ చరణ్ నిర్మిస్తోన్న ది ఇండియన్ హౌస్ మూవీలోనూ హీరోగా నటిస్తున్నాడు నిఖిల్.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు