సంగారెడ్డిలో ఓ ఆర్టీసీ ప్రయాణీకుడు చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రజంట్ బంగారం ధర దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తులం లక్షా 50 వేల దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయి. అయితే ఇతను మాత్రం….
బంగారం ధర ఎగసిపడుతోంది. పది గ్రాముల పసిడి ధర లక్షా 20 వేల రూపాయలు దాటేసింది. ఇక రానున్న రోజుల్లో గోల్డ్ మరింత ఖరీదవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద బంగారం సామాన్యులకు చిక్కుకుండా పరుగులు పెరుగుతుంది. బంగారం ఇప్పుడు కేవలం ఆభరణం కాదు, కలగానే మిగిలిపోతోంది. ఇదిలా ఉంటే.. ఇంత బంగారం మీద మోజు పెరుగుతున్న ఈ కాలంలో ఓ వ్యక్తి చూపించిన నిజాయితీ అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారు 50 లక్షల రూపాయల విలువ చేసే 39 తులాల బంగారం దొరికినా.. దాన్ని కాజేయకుండా యజమానులకే తిరిగి ఇచ్చేశాడు. అతడి పేరు దుర్గయ్య. అతడి పనిని ఇప్పుడు సంగారెడ్డి ప్రజానీకం అంతా ప్రశంసిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశ్రాంత ఉద్యోగి వసుధ, ప్రకాశ్ దంపతులు తమ మనవరాలి పెళ్లి కోసం సికింద్రాబాద్‌లో 39 తులాల బంగారం బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేశారు. తిరిగి బస్సులో తమ ఊరు వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్నాక గోల్డ్ బిస్కెట్స్ ఉన్న పర్స్ కనిపించడం లేదని గ్రహించారు. క్షణాల్లోనే ఆందోళన, భయం వారిని ఆవరించాయి. వెంటనే ఆర్టీసీ డిపోకు పరుగెత్తి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అదే బస్సులో ప్రయాణించిన దుర్గయ్యకు బంగారం ఉన్న పర్స్ కనిపించింది. ఎవరిదో తెలియకపోయేసరికి.. వెంటనే కండక్టర్‌కు అప్పగించాడు. కండక్టర్ దానిని సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ వద్దకు చేర్చాడు.
తరువాత వసుధ దంపతులు బిల్లులు చూపించి, అది తమదేనని నిర్ధారించడంతో అధికారులు బంగారాన్ని వారికే తిరిగి ఇచ్చారు. నిజాయితీకి ప్రతీకగా నిలిచిన దుర్గయ్యను డిపో మేనేజర్ ఉపేందర్ ఘనంగా సన్మానించారు. తమ బంగారం సురక్షితంగా తిరిగి లభించడంతో వసుధ దంపతులు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారంటే… మనసు నిండిపోతుంది’ అంటున్నారు స్థానికులు.