తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేలాది విద్యార్థులు ఎదురుచూస్తున్న స్కాలర్‌షిప్ బకాయిల సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రూ.161 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ చర్యతో డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ ఇలా మొత్తం 2,813 కాలేజీలు ఈ నిధులతో లాభం పొందనున్నాయి.
గత కొన్ని రోజులు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన స్కాలర్ షిప్ పెండింగ్ బకాయిల వివాదం కాస్త సద్దుమణిగించింది. ఈ సమస్యను ప్రభుత్వం తాజాగా పరిష్కరించింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రూ.161 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ చర్యతో డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ ఇలా మొత్తం 2,813 కాలేజీలు ఈ నిధులతో లాభం పొందనున్నాయి. ప్రజాభవన్‌లో గురువారం సాయంత్రం జరిగిన సమీక్షా సమావేశంలో విద్యా, ఆర్థిక శాఖల అధికారులు పెండింగ్ మొత్తాలను ఖరారు చేశారు.
నెలలుగా బకాయిలు క్లియర్ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలేజీల యాజమాన్యాలు ఇటీవల బంద్‌లు, నిరసనలతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో హామీ ఇచ్చినట్టుగానే నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లేదా కాలేజీలపై ఆర్థిక భారాలు పడకుండా వ్యవస్థను స్థిరపరచడం ప్రభుత్వ లక్ష్యం అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పడిన ఆర్థిక గందరగోళాన్ని దశలవారీగా సరిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థలో మార్పుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా పనిచేస్తుందన్నారు.

