ఛలో ఢిల్లీ.. ఎవరి పోరాటం వారిదే.. బీసీ మంత్రాన్ని జపిస్తున్న ప్రధాన పార్టీలు..

ఛలో ఢిల్లీ.. ఎవరి పోరాటం వారిదే.. బీసీ మంత్రాన్ని జపిస్తున్న ప్రధాన పార్టీలు..

బీసీ.. బీసీ.. బీసీ.. తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పడు ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి…! ఒకవర్గం కోసం అన్ని వర్గాలు పోరుబాటకు సిద్ధమయ్యాయి…! స్థానిక సంస్థల ఎన్నికలు.. చావో రేవోలా మారడంతో మూడు పార్టీలు బీసీ రిజర్వేషన్ల అంశాన్నే బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాయి…! ఎవరికి వారు గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ కొట్లాడేందుకు సిద్ధవుతున్నారు.

బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్లున్నారు..! బిల్లు ఆమోదం కోసం ఎందాకైనా వెళ్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆగస్ట్‌ 5 నుంచి 7 వరకు ఢిల్లీ వేదికగా రేవంత్‌ బృందం కార్యాచరణ అమలు చేయనుంది. సామ-దాన-భేద దండోపాయం ద్వారా బీసీ రిజర్వేషన్లను సాధిస్తామంటున్నారు ప్రభుత్వ పెద్దలు.

మీరేంటి బీసీల కోసం పోరాడేది.. అసలు పోరాటమంటే ఏంటో చూపిస్తామంటోంది బీఆర్ఎస్‌. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతిని కలుస్తామంటున్నారు కారుపార్టీ నేతలు. ఢిల్లీ రావాలని కేసీఆర్‌ను నేతలు కోరగా.. సరే వెళ్లి కలుద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. ఆతర్వాత కూడా ఫలితం లేకపోతే.. మున్ముందు ఇంకాస్త దూకుడుగా ముందుకెళ్తామంటున్నారు నేతలు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ డ్రామాలాడుతోందని.. దమ్ముంటే కార్పొరేషన్‌ చైర్మన్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇటు బీజేపీ నేతలు మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. అది BC బిల్లు కాదు.. ముస్లిం రిజర్వేషన్‌ బిల్లు అంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుధ్ది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింలకు కేటాయించిన 10శాతం రిజర్వేషన్లను తొలగిస్తేనే బిల్లుకు మద్దతిస్తామంటున్నారు.

ఎమ్మెల్సీ కవిత సైతం బీసీ బిల్లు సాధన కోసం పోరుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్న అర్డినెన్స్‌ అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. బీసీ బిల్లు సాధన విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే.. అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు కవిత.

మొత్తంగా… ఓవర్‌ టు ఢిల్లీ అంటున్నాయి తెలంగాణలోని పొలిటికల్‌ పార్టీలు. మరి పార్టీల ఒత్తిడితో కేంద్రం దిగొస్తుందా..? బిల్లుకు ఆమోదం తెలుపుతుందా..? అన్నది చూడాలి.

Please follow and like us:
తెలంగాణ వార్తలు