గుడ్‌న్యూస్.. జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్.. ఆ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!

గుడ్‌న్యూస్.. జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్.. ఆ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటనలకు రోడ్‌మ్యాప్ ఖరారు చేశారు. త్రిముఖ వ్యూహంతో సీఎం ఈ పర్యటన కొనసాగించనున్నారు. ఎన్నికల ప్రచారం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కేంద్రంపై ఉపాధి హామీ నిరసన సభల్లో పాల్గొననున్నారు. జనవరి 16 నుంచి తొలి విడత, ఫిబ్రవరి 3 నుంచి మలి విడత పర్యటనలు చేపట్టి, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కదలిక తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఖరారైంది. ఈసారి పర్యటనను త్రిముఖ వ్యూహంతో నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అలాగే ఉపాధి హామీ పథకం అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన సభలు నిర్వహించడమే ఈ వ్యూహంలోని ప్రధాన అంశాలు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా రెండు దఫాల పర్యటన షెడ్యూల్‌ను సీఎం ఖరారు చేశారు. బహిరంగ సభలతో పాటు వీలున్న చోట్ల కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.

జనవరి 16 నుంచి తొలి విడత పర్యటన

మొదటి విడత జిల్లాల పర్యటనను ఈ నెల 16 నుంచి ప్రారంభించనున్నారు. జనవరి 16, 17, 18 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. నిర్మల్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు కూడా హాజరవుతారు. జనవరి 16న నిర్మల్‌లో, 17న జడ్చర్లలో, 18న పాలేరు–ఖమ్మం ప్రాంతంలో సీఎం పర్యటన కొనసాగనుంది. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కూడా వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

విదేశీ పర్యటన షెడ్యూల్

జనవరి 19న సీఎం మేడారం వెళ్లనున్నారు. అనంతరం అదే రోజు సింగపూర్, అమెరికా దేశాల పర్యటనకు బయలుదేరనున్నారు. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. మరుసటి రోజు పరిస్థితిని బట్టి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఫిబ్రవరి 3 నుంచి మలి విడత

ఫిబ్రవరి 3 నుంచి రెండో విడత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ విడతలో ఆరు రోజుల పాటు ఆరు ఉమ్మడి జిల్లాల్లో సీఎం పర్యటించనున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. వరుసగా నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో కూడా తొలి విడత తరహాలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయి. కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభల ద్వారా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.

ఉపాధి హామీపై నిరసన సభలు

ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభలను విజయవంతం చేయాల్సిన బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులకు టీపీసీసీ అప్పగించనుంది.

అయితే రెండో విడతలో చివరి రోజుల్లో సీఎం వెళ్లే మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కావాల్సి ఉందని సమాచారం. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలకు ముందు జిల్లాల పర్యటనలతో రాజకీయంగా పూర్తి స్థాయిలో కదలిక తీసుకురావడమే సీఎం వ్యూహంగా కనిపిస్తోంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు