వినియోగ దారులు తమకు అవసరమైన వస్తువులను దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో వినియోగ దారుల ముంగిటకే సంస్థలు తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. దీంతోపాటు ఆన్ లైన్ ద్వారా అవసరమైన వస్తువులను వినియోగ దారులు కొనుగోలు చేస్తున్నారు. అయితే రైతులకు అవసరమైన డీజిల్ కూడా వారి ముంగిటకు వస్తోంది.
సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ప్రత్యేకత ఉంది. రైతుల కళ్లాల దగ్గరకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లుగానే ఇతర అవసరాలను కూడా తీర్చాలని సొసైటీ భావించింది. అంది వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం (PACS) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రైతులు తమ అవసరానికి అనుగుణంగా ముఖ్యమైన డీజిల్ కొనుగోలు చేసి ఇంట్లో నిలువ చేసుకుంటారు. అయినా డీజిల్ సరిపోక ఇబ్బంది పడుతుంటారు. దీంతో డీజిల్ కోసం దూరంలో ఉండే పెట్రోల్ బంక్‌ల వద్దకు వెళుతుంటారు. ఒక్కోసారి బంక్‌లలో నో స్టాక్ అనే బోర్డు కూడా ఉంటుంది. రైతులకు డీజిల్ కష్టాలను దూరం చేసేందుకు రైతుల వద్దకే డీజిల్ ను అందుబాటులోకి తీసుకురావాలని PACS భావించింది.
ఈ లక్ష్యంతో మొబైల్ డీజిల్ ట్యాంకర్ ను ప్రారంభించింది. అత్యాధునిక హంగులతో మొబైల్ డీజిల్ ట్యాంకర్ ను రూపొందించారు. మొబైల్ డీజిల్ ట్యాంకర్ తో గ్రామాల్లో రైతుల ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు ఇంటివద్దకే వెళ్లి డీజిల్ సరఫరా జరుగుతోంది. దీంతో డీజిల్ కోసం దూరంలో ఉండే పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లకుండా తమ ముంగిటకే డీజిల్ సరఫరా కావడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.
ఫోన్ చేసి తమకు అవసరమైన డీజిల్ ను ఆర్డర్ చేస్తే చాలు తమ వద్దకే మొబైల్ డీజిల్ ట్యాంకర్ వస్తుందని రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారి మొబైల్ డీజిల్ ట్యాంకర్ సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ప్రారంభమయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే నడిగూడెం సహకార సంఘం లాభాలబాటలో నడుస్తూ రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది. రైతులకు అవసరమైన మరిన్ని సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు.