అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ రిలీఫ్

అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ రిలీఫ్

సుప్రీం కోర్టులో ఏపీ మాజీ సీఎం జగన్‌కు ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. బెయిల్‌ రద్దుకు సహేతుకమైన కారణాలు లేవని, అలాంటప్పుడు రద్దు అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ లేదని స్పష్టం చేసింది.

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ మరో ధర్మాసనానికి బదిలీ, ఆయన బెయిల్‌ రద్దు చేయాలన్న ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. బెయిల్ రద్దుకు సహేతుకమైన కారణాలు లేవని.. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌చంద్ర మిశ్రా బెంచ్ అభిప్రాయపడింది. దీంతో హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు లాయర్ కోరగా.. ధర్మాసనం అంగీకరించింది. దీంతో ఈ పిటిషన్ డిస్మిస్ అయింది.

మరోవైపు ట్రయల్ వేగంగా సాగాలని, విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. జగన్ కేసును తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందని.. ప్రజాప్రతినిధుల విషయంలో రోజువారీ విచారణ చేపట్టాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకూ వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది. ట్రయల్ కోర్టు.. అలా విచారణ జరుపుతుందో లేదో హైకోర్టు పర్యవేక్షణ చేయాలని ఆదేశించింది. అంచేత పిటిషన్‌ను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు