సుడిగాలి సుధీర్ తన కష్టాల ప్రస్థానాన్ని ఓ సందర్భంలో పంచుకున్నారు. తండ్రి ప్రమాదానికి గురైన తర్వాత ఆర్థికంగా కుంగిపోయిన కుటుంబం కోసం చదువు మానేసి, హైదరాబాద్‌లో ఆహారం, నీరు కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడినట్లు తెలిపాడు. తల్లిదండ్రుల సంతోషమే లక్ష్యంగా జబర్దస్త్ ద్వారా విజయం సాధించి, వారి జీవితాలను మార్చినట్లు వివరించాడు.
ప్రముఖ తెలుగు టెలివిజన్ హోస్ట్, జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ తన జీవితంలోని కఠినమైన రోజులను, అవి ఎలా తన విజయానికి సోపానాలుగా మారాయో ఓ సందర్భంలో వివరించారు. 2004లో తన తండ్రికి యాక్సిడెంట్ జరిగి, ఆయన షుగర్ పేషెంట్ కావడంతో కుటుంబ పరిస్థితి తారుమారైందని సుధీర్ గుర్తు చేసుకున్నారు. అప్పటి వరకు ఆర్థికంగా మంచిగా ఉన్న తాము ఒక్కసారిగా పూర్తిగా కుంగిపోయి, నిరుపేద స్థితికి చేరున్నట్లు తెలిపారు. పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని, అప్పటికి ప్లస్ వన్ చదువుతున్న సుధీర్ తన ప్లస్ టూ ఎడ్యకేషన్ మధ్యలోనే ఆపివేశారు. కుటుంబానికి అండగా నిలబడాలనే దృఢ సంకల్పంతో, మొదట రామోజీ ఫిల్మ్ సిటీలో నెలకు రూ.8,000 జీతంతో ఒక మెజీషియన్‌గా పనిచేశారు. రెండు సంవత్సరాలు కష్టపడిన తర్వాత, ఆ ఉద్యోగంలో తన భవిష్యత్తు లేదని, జీవితంలో ఎదుగుదల లేదని గ్రహించారు. అప్పులు పెరిగిపోతున్నాయని తెలుసుకుని, రామోజీ ఫిల్మ్ సిటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, మెరుగైన అవకాశాల కోసం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
హైదరాబాద్‌లో సుధీర్‌కు ఎదురైన కష్టాలు వర్ణనాతీతం. తినడానికి తిండి లేక పది రూపాయల ప్రియా పచ్చడి ప్యాకెట్లతో రోజులు గడిపేవారు. వండుకోవడానికి బియ్యం లేకపోవడం, ఇంట్లో కనీసం తాగడానికి నీరు కూడా లేకపోవడంతో, సింక్ పంపులో వచ్చే నీటిని తాగినట్లు చెప్పారు. అప్పట్లో హైదరాబాద్‌లో స్నేహితులు కూడా లేకపోవడం, తన స్నేహితులందరూ విజయవాడలో బీటెక్ చదువుకుంటుండటం మరింత నిరాశకు గురిచేసిందని తెలిపారు. ఈ కష్టాలతో డిప్రెషన్‌కు గురైన సమయంలో, తన తల్లిదండ్రుల సంతోషం కోసం ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నారు. అప్పటివరకు ఇంటర్నేషనల్ స్థాయిలో మెజీషియన్‌గా ఎదగాలనే గోల్ ఉన్నా, కుటుంబ పరిస్థితి తన గోల్‌ను మార్చేలా చేసింది. తన తల్లిదండ్రులు ఆకలితో ఉన్నా, తమ కష్టాలను పిల్లలకు చెప్పరని, వారి ఆనందమే వారికి ముఖ్యమని సుధీర్ ఉద్వేగంగా వివరించారు. ఈ ఆలోచనతోనే రెండేళ్లు, రెండున్నరేళ్లు తీవ్రంగా కష్టపడ్డారు. చివరికి, తన తల్లిదండ్రుల ఆనందం, ముఖ్యంగా తన తల్లి తనను టీవీ తెరపై చూడాలనే కోరిక, సుధీర్‌కు పెద్ద ప్రేరణగా నిలిచింది. 2013 ఫిబ్రవరి 2న తన జీవితంలో ఒక మలుపు తిరిగిందని సుధీర్ చెప్పారు. అది జబర్దస్త్ షోలో ఆయన మొదటిసారి షూటింగ్ చేసిన రోజు. ఫిబ్రవరి 7న ఆ ఎపిసోడ్ ప్రసారమైంది. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. జబర్దస్త్ విజయం తన కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుండి బయటపడేసిందని, ఒకప్పుడు తన తల్లి మంగళసూత్రం అమ్మే పరిస్థితి నుంచి, ఇప్పుడు వారికి కావాల్సిన దానికంటే ఎక్కువే ఉందని ఆనందంగా తెలిపాడు. మంచి ఇల్లు, కారు, కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు.
చివరగా, తన జీవితంలోని కష్టాలను ఇతరులు అనుకరించాలని తాను చెప్పడం లేదని, కానీ ప్రతి మనిషిలో ఒక లక్ష్యాన్ని సాధించాలనే కసి ఉండాలని సుధీర్ సందేశమిచ్చారు. చదువు ఒక్కటే విజయానికి ప్రామాణికం కాదని, తనలోని టాలెంట్‌ను గుర్తించి దాన్ని మెరుగుపరచుకోవడం కూడా ముఖ్యమని చెప్పారు. తాను ఇంటర్ ఆరు సంవత్సరాలు చదివానని, కానీ తన స్నేహితులు బీటెక్ పాస్ అయ్యే నాటికి తాను ఇంటర్‌లో ఉన్నానని ఉదాహరణగా చెప్పారు. అయితే, తాను చదువుకున్న టాప్ స్కూల్స్, కాలేజీల వల్ల మనుషులతో ఎలా ప్రవర్తించాలో డిసిప్లిన్‌ను నేర్చుకున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను ఒక విజయవంతమైన స్థితిలో ఉన్నానని, తనలోని టాలెంట్‌ను గుర్తించడం వల్లే ఇది సాధ్యమైందని సుధీర్ తన స్ఫూర్తిదాయక కథను ముగించారు.

