మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం ఆరోగ్యానికి హానికరం. మొలకెత్తిన బంగాళాదుంపల్లో ఉండే ‘సోలానిన్’ అనే ప్రమాదకరమైన టాక్సిన్ జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది తీవ్రమైన వాంతులు, విరోచనాలు, తల తిరగడం, అపస్మారక స్థితి వంటి సమస్యలకు దారితీస్తుంది. సోలానిన్ విషం శరీరంలో పెరిగితే ప్రాణాంతకం కూడా కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మొలకలు వచ్చిన బంగాళాదుంపలకు దూరంగా ఉండటం మంచిది.
మనం సాధారణంగా బంగాళాదుంపలను ఇంటికి తెచ్చుకుంటాం. వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచినప్పుడు మొలకలు రావడం మనం గమనిస్తుంటాం. చాలామంది ఈ మొలకలను తీసేసి బంగాళాదుంపలను వంటకు ఉపయోగిస్తుంటారు. అయితే, మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల ప్రాణాపాయం కూడా సంభవించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బంగాళాదుంపలలో ‘సోలానిన్’ అనే విషపూరిత టాక్సిన్ ఉంటుంది. ఈ టాక్సిన్ ప్రధానంగా బంగాళాదుంపలు మొలకెత్తినప్పుడు, లేదా సూర్యరశ్మికి ఎక్కువగా గురై ఆకుపచ్చ రంగులోకి మారినప్పుడు అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలో విషాన్ని పెంచి, జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీని వల్ల వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇటీవల 25 ఏళ్ల వ్యక్తి మొలకెత్తిన బంగాళాదుంప కూర తిని వాంతులు, అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల కేవలం జీర్ణ సమస్యలే కాకుండా, అలసట, కాళ్లు, చేతుల్లో నొప్పులు, తల తిరుగుడు, తిమ్మిరి వంటి నాడీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. తీవ్రమైన సందర్భాల్లో శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఇలాంటి ఆహార పదార్థాలకు వారిని దూరంగా ఉంచడం చాలా ముఖ్యం.
పాడవ్వకూడదంటే.. బంగాళాదుంపలను గది ఉష్ణోగ్రత వద్ద, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. మొలకలు వచ్చిన వెంటనే వాటిని పడేయాలి. ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను కూడా వాడకూడదు. బంగాళాదుంపలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే, వాటితో పాటు ఒక యాపిల్‌ను నిల్వ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం వంట కోసం మొలకలను తొలగించడం సరిపోదు. సోలానిన్ విషం బంగాళాదుంప మొత్తంలో వ్యాపిస్తుంది కాబట్టి, మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను పూర్తిగా పారవేయడమే సురక్షితమైన మార్గం. లేకపోతే అది ప్రాణాంతకం కావచ్చు.