పొట్టలో గ్యాస్, ఉబ్బరం ఉన్నప్పుడు చాలామంది సోడా లేదా కూల్ డ్రింక్స్ తాగితే ఉపశమనం లభిస్తుందని భావిస్తారు. పొట్టలో గ్యాస్, ఉబ్బరం తగ్గించడానికి సోడా తాగడం తాత్కాలిక ఉపశమనం ఇవ్వొచ్చు కానీ, ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్బోనేటెడ్ డ్రింక్స్ స్పింటర్‌ను దెబ్బతీసి యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తాయి. తద్వారా అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
కొంచెం ఎక్కువగా తిన్నా.. లేదా పొట్టలో గ్యాస్, ఉబ్బరం లేదా తేపుల సమస్యలతో బాధపడుతున్నప్పుడు చాలామంది సోడా, కూల్ డ్రింక్స్ లేదా ఇతర కార్బోనేటెడ్ పానీయాలను తాగుతారు.. ఇలా చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.. అయితే.. సోడా తాగిన తర్వాత.. తక్షణమే కొంత తేలికపడిన అనుభూతి కలిగించినా.. ఈ అలవాటు ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుందని గ్యాస్ట్రోఎంటరాలజీస్ట్‌లు పేర్కొంటున్నారు. ఈ పానీయాలు కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి తప్ప, మూల సమస్యకు పరిష్కారం కాదని వైద్యులు పేర్కొంటున్నారు.
సోడా లేదా కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత ఏం జరుగుతుందంటే..
కార్బోనేటెడ్ డ్రింక్స్, కెఫీన్ బేస్డ్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ డ్రింక్స్ వంటివి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు, జీర్ణవ్యవస్థలోని ముఖ్యమైన భాగమైన స్పింటర్‌లను ప్రభావితం చేస్తాయి. స్పింటర్‌లు అంటే అన్నవాహిక – పొట్ట మధ్య ఉండే కండర వలయాలు. ఇవి ఆహారం, పొట్టలోని ఆమ్లం పైకి, అంటే అన్నవాహికలోకి తిరిగి రాకుండా నిరోధిస్తాయి. మనం తలకిందులుగా యోగాసనాలు వేసినా కూడా పొట్టలోని పదార్థాలు పైకి రాకుండా ఈ స్పింటర్‌లు రక్షిస్తాయి.
అయితే, సోడా వంటి కార్బోనేటెడ్ పానీయాలను అధికంగా తాగడం వల్ల ఈ స్పింటర్‌లు బలహీనపడతాయి లేదా కృత్రిమంగా రిలాక్స్ అవుతాయి. ఇలా క్రమంగా దెబ్బతింటాయి. స్పింటర్‌లు డ్యామేజ్ అవ్వడం వల్ల పొట్టలో ఉండాల్సిన ఆమ్లం ఫుడ్ పైప్‌లోకి ప్రవేశించడం ప్రారంభమవుతుంది. దీనినే యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. అన్నవాహికలోని మ్యూకోసా (లోపలి పొర) పొట్టలోని ఆమ్లాన్ని తట్టుకునే విధంగా ఉండదు. నిరంతరం యాసిడ్ రిఫ్లక్స్ వల్ల అన్నవాహికలోని కణజాలం దెబ్బతిని, బ్యారెట్ ఈసోఫేగస్ అనే స్థితికి దారితీస్తుంది. ఇది క్యాన్సర్‌కు పూర్వ దశగా పరిగణిస్తారు.
గత 20-25 సంవత్సరాలుగా ఇండియాలో, ముఖ్యంగా సబ్ కాంటినెంట్ ప్రాంతంలో అన్నవాహిక (ఈసోఫేగస్), పొట్ట పై భాగంలో వచ్చే క్యాన్సర్‌లు (అప్పర్ జీఐ క్యాన్సర్‌లు) విపరీతంగా పెరిగాయి. ఇంతకు ముందు పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్యలు, ఇప్పుడు మన దేశంలో కార్బోనేటెడ్ డ్రింక్స్ వినియోగం పెరగడం వల్ల విస్తరిస్తున్నాయని వైద్య నిపుణులు, అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. ఈ పానీయాల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా, దీర్ఘకాలంలో శరీరానికి, ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు తీవ్రమైన హాని కలిగిస్తాయి.
కొంతమంది చాతి నొప్పిని కూడా గ్యాస్ సమస్యగా పొరబడి, సోడా తాగితే తగ్గుతుందని భావిస్తారు. అయితే, చాతి నొప్పి కొన్నిసార్లు గుండె సంబంధిత సమస్యలకు సూచన కావచ్చు. అలాంటి కీలక సమయంలో సోడా తాగి ఆలస్యం చేయడం ప్రమాదకరం. సోడా లేదా గ్యాస్ డ్రింక్స్ ఎటువంటి చికిత్స కాదని గుర్తుంచుకోవాలి.
ఇవి కేవలం తాత్కాలికంగా గ్యాస్‌ను బయటికి పంపించడంలో సహాయపడవచ్చు.. కానీ మూల కారణాన్ని పరిష్కరించలేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. . నెలలు లేదా సంవత్సరాల తరబడి వీటిని అలవాటు చేసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కనుక, ఇటువంటి పానీయాలను పూర్తిగా మానేయడం లేదా వీలైనంత వరకు తగ్గించడం ఆరోగ్యానికి చాలా మంచిదని పేర్కొంటున్నారు.
వైద్యులు, నిపుణుల సూచనలతో ఈ కథనాలు అందించాం.. మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

