సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

పహల్గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ వార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబం స్పందించింది. భారత్‌ ప్రతీకార చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ భార్య కామాక్షి ప్రసన్న మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి, ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు తెలుపుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.

భారత్ అన్నంత పని చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ.. ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపుదాడులు చేసింది. మొత్తం 9 ఉగ్రస్థావరాలు లక్ష్యంగా మిసైళ్ల వర్షం కురిపించింది.. 100 మందికిపైగా ఉగ్రవాదులను సమాధి చేసి పాకిస్తాన్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణి దాడుల తర్వాత.. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధితులైన 26 మందిలో ఒకరైన మధుసూదన్ రావు భార్య కామాక్షి ప్రసన్న తీవ్ర భావోద్వేగ సందేశాన్ని ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సాయుధ దళాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

“నిన్న రాత్రి ఆపరేషన్ సిందూర్ జరిగిందని విన్నాను.. ఇది చాలా కుటుంబాలకు ప్రతీకారం తీర్చుకుంది. మేము మా భర్తలను కోల్పోయాము.. సిందూర్ పేరును అంతా చెబుతుంది. ఈ ప్రతీకారం తీర్చుకున్నందుకు నేను ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మా జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. మేము మా భర్తలను కోల్పోయామని వారు అనుకుంటున్నారు.. కానీ మేము మా ప్రాణాలను కోల్పోయాము. పహల్గామ్‌లోని కుటుంబాలకు జరిగినది మరెవరికీ జరగకూడదు.. సిందూర్ అంటే మా జీవితాలు..” అని కామాక్షి కన్నీరుపెట్టుకున్నారు.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపబడిన పర్యాటకులలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మధుసూదన్ కూడా ఉన్నారు. ఆయన బెంగళూరులో పనిచేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్‌ విహారయాత్రకు పహాల్గామ్‌కు వెళ్లారు. ఆపరేషన్‌ సింధూర్‌తో ఇపుడు ఆ కుటుంబం కాసింత ఊరటతో ..ఊపిరిపీల్చుకుంటోంది.. నా దేశం దుష్ట శిక్షణ చేస్తోందని చెబుతోంది..

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో ఏరివేయాలని.. మోదీ సర్కార్‌ ఆ పనిచేస్తుందనే నమ్మకం వుందన్నారు మధుసూదన్‌ కుటుంబసభ్యులు.

పహల్గాం దాష్టీకం గురించి వింటనే ఒళ్లు జలదరిస్తుంది. కానీ ఆరోజు అక్కడ వున్న పర్యాటకులు ఇప్పటికీ ఆ షాక్‌ నుంచి కోలుకోలేకపోతున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదానికి తగిన శాస్తి చేశారంటూ ఆపరేషన్‌ సింధూర్‌ను మనసారా అభినందిస్తున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు