అయ్యో ఘోరం.. 37కి పెరిగిన మృతుల సంఖ్య.. పాపం మరో 27 మంది ఏమయ్యారో ఏంటో..

అయ్యో ఘోరం.. 37కి పెరిగిన మృతుల సంఖ్య.. పాపం మరో 27 మంది ఏమయ్యారో ఏంటో..

ఊహించని ప్రమాదం.. ఊహకందని విషాదం. రోజూలాగే పనికి వెళ్లిన కార్మికులను రియాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో అసలేం జరుగుతుందో తెలియని భయంకర పరిస్థితి. షాక్‌ నుంచి తెరుకునేలోపే తీవ్రంగా గాయపడ్డ కార్మికులు ఆర్తనాదాలు.. చనిపోయిన వారి మృతదేహాలతో ఆ ప్రాంతమంతా హాహాకారాలతో హృదయవిదారకంగా మారిపోయింది.

సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 37 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరో 35 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇంకా 27 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. ప్రమాదం నుంచి 57 మంది సురక్షితంగా బయటపడినట్లు కలెక్టర్ ప్రకటించారు. క్షతగాత్రుల్లో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని.. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే ఐదుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చాలామంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు భవనం మొత్తం కూలిపోయింది.. మరో భవనానికి బీటలు వచ్చాయి. వెంటనే.. అధికార యంత్రాంగం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. స్థానిక అధికారులు, సిబ్బందితో పాటు NDRF బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి మృతదేహాలను తరలించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో వాటిని గుర్తించేందుకు డీఎన్‌ఏ టెస్టులు చేయనున్నారు. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.. దీంతో అధికారులు శిథిలాలు తొలగిస్తూ.. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సహాయక చర్యల్లో సింగరేణి రెస్క్యూ టీమ్ కూడా పాల్గొంటోంది.

ప్రమాద ఘటన బాధితుల చికిత్స పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఈ అధికారులు పర్యవేక్షించనున్నారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ముగ్గురు అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. సిగాచి ప్రమాద బాధితుల కోసం సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ సైతం ఏర్పాటు చేశారు. ప్రమాద బాధితుల వివరాల కోసం 08455276155ను సంప్రదించాలని కలెక్టర్ వెల్లడించారు.

సిగాచి కెమికల్ పరిశ్రమ పేలుడు ఘటనలో ప్లాంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ దుర్మరణం పాలయ్యారు. గోవన్‌ ప్లాంట్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించిందని.. ప్రమాద ధాటికి ఆయన కారు నుజ్జునుజ్జయిందని అధికారులు తెలిపరు.

ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన సీఎం రేవంత్‌రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం పురమాయించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. అందాకా బాగోగులు చూసుకోవాలని మంత్రులకు ఆదేశాలిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అమాత్యులు దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్.. జిల్లా మెకానిజమ్ మొత్తాన్ని అలర్ట్ చేశారు. రియాక్టర్ పేలుడుపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రాధమిక కారణాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది.

ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించనున్న సీఎం రేవంత్
ఇవాళ పాశమైలారం ఘటనాస్థలిని పరిశీలించనున్న సీఎం రేవంత్.. బాధితులను పరామర్శించనున్నారు. మంత్రి దామోదరకు ఫోన్‌ చేసిన రేవంత్.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. రాత్రంతా ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను మంత్రి దామోదర పర్యవేక్షించారు.

ప్రమాదంపై సీఎస్‌ రామకృష్ణారావు నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ
మరోవైపు పాశమైలారం ప్రమాదంపై మరో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీఎస్‌ రామకృష్ణారావు నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని నియమించింది. కమిటీలో సభ్యులుగా DRF స్పెషల్ సీఎస్, కార్మిక శాఖ సీఎస్, హెల్త్ సెక్రటరీ, ఫైర్‌ సర్వీసెస్‌ అడిషనల్‌ డీజీలు ఉన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సిఫార్సు చేయనుంది.

మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల చొప్పున పరిహారం
పాశమైలారం ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది కేంద్రం. గాయపడ్డవారికి 50 వేల రూపాయల పరిహారం అందించనుంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుభూతి ప్రకటించారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు