ఇది కదా సనాతన ధర్మం గొప్పతనం.. రాహు కేతు పూజ చేసిన పదుల కొద్దీ రష్యన్లు..

ఇది కదా సనాతన ధర్మం గొప్పతనం.. రాహు కేతు పూజ చేసిన పదుల కొద్దీ రష్యన్లు..

శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనానికి వచ్చిన రష్యన్ భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో ఆలయాన్ని సందర్శించి ఆకట్టుకున్నారు. రాహు–కేతు పూజల్లో పాల్గొని, శిల్పకళతో ఉట్టిపడే చారిత్రక కట్టడాలకు ముగ్ధులయ్యారు. ఆలయ విశిష్టతను అర్చకుల నుంచి తెలుసుకున్న వారు స్వామి–అమ్మవార్ల పట్ల మరింత భక్తి, విశ్వాసం పెరిగిందని చెప్పారు.

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో విదేశీ భక్తులు సందడి చేశారు. ముక్కంటిని దర్శించుకునేందుకు శ్రీకాళహస్తికి వచ్చిన రష్యన్ దేశస్థులు కట్టు బొట్టుతో సాంప్రదాయాన్ని పాటించారు. రాహు కేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి ఆలయ సందర్శనలో సందడి చేశారు. రష్యాకు చెందిన దాదాపు 40 మంది భక్తులు శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన చారిత్రక ఆలయ కట్టడాలకు ముగ్ధులయ్యారు. ఆలయంలో రాహు కేతు పూజల్లో పాల్గొన్న రష్యన్లలో 29 మంది మహిళా భక్తులు ఉండగా.. తొమ్మిది మంది పురుషులు ఉన్నారు. ఆలయంలో రెండు గంటలకు పైగా గడిపిన రష్యన్లు దేశస్తులు.. ఇక్కడ జరుగుతున్న పూజలు, కొలువైన దేవతా మూర్తుల వివరాలను తెలుసుకున్నారు. ప్రత్యేకించి ఆలయంలోని శిల్పకళ రష్యన్ భక్తులను ఆకట్టుకున్నాయి. అధికారులు వారికి.. స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు.

ఆలయ విశిష్టత స్వామి అమ్మవార్లు కొలువైన ఆలయ ప్రాశ స్త్యాన్ని అర్చకులను అడిగి తెలుసుకున్నారు రష్యన్లు. ఆలయం గురించి తెలుసుకున్న తర్వాత స్వామి అమ్మవార్ల పట్ల మరింత భక్తి, నమ్మకం, విశ్వాసం పెరిగిందని చెబుతూ.. రష్యన్ దేశస్తులు ఆలయ ధ్వజస్తంభం ముందు అర్చకులతో కలిసి ఫోటోలు తీసుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి వచ్చిన విదేశీయులను స్థానిక భక్తులు సైతం ఆసక్తిగా చూశారు. విదేశీయులు స్వామి అమ్మవార్ల పట్ల కనబరిచిన భక్తిశ్రద్ధలను చూసి ఆశ్చర్యపోయారు. దర్శనం అనంతరం గురు దక్షిణమూర్తి ఆలయం వద్ద వేదపండితుల ఆశీర్వచనం పొందిన రష్యన్ భక్తులకు.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు