రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్‌ను ప్రధాన అర్హతగా నిర్ణయించనున్నారు. దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్‌ను ప్రధాన అర్హతగా నిర్ణయించనున్నారు. దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోన్ అప్లికేషన్‌కు ముందు సిబిల్ స్కోర్‌ను తప్పనిసరిగా పరిశీలించనున్న బ్యాంకులు, దానికి సంబంధించి ఫీజు కూడా వసూలు చేయనున్నాయి. ప్రతి అప్లికేషన్‌కి రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేసే యోచనలో కొన్ని బ్యాంకులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.
సిబిల్ స్కోర్ వసూలుపై ప్రభుత్వం స్పందించింది. తక్కువ ఆదాయ వర్గాల అభ్యర్థులపై భారం పడకుండా చూడాలనే ఉద్దేశంతో బ్యాంకులు వసూలు చేసే ఫీజును మినహాయించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నివేదించనున్నారు. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (SLBC) సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 16,25,441 దరఖాస్తులలో అత్యధికంగా బీసీల నుంచి 5,35,666, ఎస్సీల నుంచి 2,95,908, ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనారిటీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనారిటీల నుంచి 2,689 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం మండల స్థాయిలో దాదాపు 70 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారులు తెలిపారు.
తుది జాబితా మే నెలాఖరులో అందుబాటులోకి రానుంది. మండల అధికారులు పరిశీలించిన దరఖాస్తులను బ్యాంకులకు పంపించి అర్హుల ఎంపిక జరుగుతుంది. తుది జాబితా తయారైన తర్వాత అదే కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్దిదారులకు రుణాల మంజూరు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొదటి విడతలో సుమారు 5 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనం అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.