రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ పర్యటన నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు, భారత్‌కు చమురు రాయితీలు, డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ వాడకం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అమెరికా ఆంక్షలు, సుంకాల మధ్య ఈ పర్యటన భారత్ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన నేపథ్యంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా సహా యూరోపియన్ దేశాలు ఈ పర్యటనను నిశితంగా గమనిస్తున్నాయి. కాగా పుతిన్ పర్యటన నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 0.21శాతం తగ్గి బ్యారెల్‌కు 62.32 డాలర్ల వద్ద ఉండగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ 0.20శాతం తగ్గి బ్యారెల్‌కు 58.52 డాలర్ల వద్ద ఉంది. గత కొన్ని రోజులుగా క్రూడ్ ధర 1.2శాతం తగ్గింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య త్వరలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందనే వార్తలతో ప్రపంచ అస్థిరత తగ్గుతుందని భావించి, పెట్టుబడిదారులు చమురు కొనుగోలును నిలిపివేశారు.
భారత్‌కు రష్యా రాయితీలు?
భారతదేశంతో తమ స్నేహాన్ని బలోపేతం చేసుకోవడానికి, రష్యా ముడి చమురు ఎగుమతుల్లో మరిన్ని రాయితీలు ఇచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా, భారత్ మరింత తక్కువ ధరకు ముడి చమురును పొందే అవకాశం ఉంది. దీని ప్రభావం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గుదల రూపంలో కనిపించవచ్చు. అయితే భారత్ ఇప్పటికే రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించినట్లు వార్తలు వెలువడటం ఈ పర్యటన ముందు గమనార్హం.
శాంతి చర్చలపై పుతిన్ ప్రకటన?
రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రక్రియపై పుతిన్ తన భారత పర్యటన సందర్భంగా పెద్ద ప్రకటన చేస్తారని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. బుధవారం పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన ప్రతినిధులు దాదాపు ఐదు గంటల పాటు చర్చలు జరిపారు. అయితే శాంతి ప్రక్రియపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే, ప్రపంచ అస్థిరత తగ్గి, ముడి చమురు ధరలు మరింత పడిపోతాయని భావిస్తున్నారు.
డాలర్‌కు ప్రత్యామ్నాయంపై చర్చ
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా నిరంతరం భారత్‌పై ఒత్తిడి తెస్తోంది. డాలర్, రూపాయి మధ్య మారకపు రేటులో వ్యత్యాసం భారతీయ కొనుగోలుదారులను ప్రభావితం చేస్తోంది. గతంలో భారత్ డాలర్లకు బదులుగా రియాల్స్, చైనా కరెన్సీలను ఉపయోగించింది. ఇప్పుడు చమురు కొనుగోలు చేయడానికి డాలర్లు, చైనా కరెన్సీ, రియాల్స్ కాకుండా ఇతర కరెన్సీలను ఉపయోగించడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.
అమెరికా సుంకం ప్రభావం
ఏప్రిల్ 2022 నుండి జూన్ 2025 వరకు రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ 17 బిలియన్ డాలర్లు ఆదా చేసింది. అయితే ఈ కొనుగోళ్ల కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ ఎగుమతులపై భారీగా సుంకాలు విధించారు. ఈ అదనపు సుంకాల వల్ల భారత ఎగుమతులకు దాదాపు 37 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. దీని ఫలితంగా దేశ జీడీపీ వృద్ధి రేటు 1 శాతం తగ్గే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. పుతిన్ పర్యటనలో ముడి చమురు సరఫరా, కరెన్సీ మార్పిడి, రక్షణ రంగ సహకారం వంటి అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

