అస్సలు నిర్లక్ష్యం వద్దు! ఈ 8 సంకేతాలు గర్భిణులకు ఎంత ప్రమాదమో తెలుసా?

అస్సలు నిర్లక్ష్యం వద్దు! ఈ 8 సంకేతాలు గర్భిణులకు ఎంత ప్రమాదమో తెలుసా?

మాతృత్వం ప్రతి స్త్రీ జీవితంలో ఒక అద్భుతమైన, జీవితాన్ని మార్చే అనుభవం. గర్భధారణ సమయంలో కలిగే ప్రతి అనుభూతి, శారీరక మార్పు ఒక కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది. అయితే, ఈ సమయంలో తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవగాహన, సరైన సంరక్షణ చాలా అవసరం. చిన్న చిన్న లక్షణాలను కూడా విస్మరించకపోవడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. పూణేలోని మణిపాల్ హాస్పిటల్‌కు చెందిన ప్రసూతి వైద్యురాలు డాక్టర్ స్వాతి కాకరే పంచుకున్న ఆ ఎనిమిది ముఖ్యమైన హెచ్చరికలు ఇవి.

గర్భధారణ ప్రారంభంలో కొద్దిపాటి రక్తస్రావం సాధారణం కావచ్చు. అయితే, రక్తస్రావం ఎక్కువగా లేదా ఎక్కువసేపు కొనసాగితే, అది వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన హెచ్చరిక సంకేతం. ఇది గర్భస్రావం, జరాయువు ప్రెవియా (Placenta Previa) లేదా జరాయువు అబ్రప్షన్ (Placental Abruption) వంటి ప్రమాదకర పరిస్థితులకు సంకేతం కావచ్చు. తల్లి బిడ్డ శ్రేయస్సు కోసం అప్పుడు అత్యవసర సంరక్షణ అవసరం కావచ్చు.

తీవ్రమైన తిమ్మిర్లు లేదా కడుపు నొప్పి
తేలికపాటి పొత్తికడుపు అసౌకర్యం సాధారణం. కానీ తీవ్రమైన, పదునైన పొత్తికడుపు నొప్పిని విస్మరించకూడదు. ఇది అరుదైన, ప్రమాదకరమైన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కి సంకేతం కావచ్చు, ఇందులో పిండం గర్భాశయం వెలుపల పెరుగుతుంది. తక్షణ చికిత్స అందించకపోతే అంతర్గత రక్తస్రావం ప్రమాదం ఉంటుంది.

నిరంతర వాంతులు నిర్జలీకరణం
మార్నింగ్ సిక్నెస్ మాదిరి కాకుండా, హైపెరెమిసిస్ గ్రావిడారమ్ అనే ప్రమాదకరమైన పరిస్థితి డీహైడ్రేషన్, బరువు తగ్గడం ఎలక్ట్రోలైట్ క్షీణతకు దారి తీస్తుంది. ఈ పరిస్థితిలో ఐవీ ఫ్లూయిడ్స్, వికారం నివారణ మందులు వెంటనే అవసరం.

వాపు, తలనొప్పి, దృష్టి మార్పులు
ముఖం, చేతుల్లో ఆకస్మిక వాపు, అస్పష్టమైన దృష్టి తీవ్రమైన తలనొప్పి అనేది ప్రీఎక్లంప్సియా అనే అధిక రక్తపోటు పరిస్థితికి హెచ్చరిక సంకేతం. చికిత్స చేయకపోతే ఇది ప్రాణాంతకమైన ఎక్లంప్సియా కు దారితీస్తుంది.

జ్వరం లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్
గర్భిణీ స్త్రీలు జ్వరం లేదా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ను విస్మరించకూడదు. ఎందుకంటే అధిక జ్వరం లేదా ఇన్ఫెక్షన్ పిండం అభివృద్ధిని ప్రభావితం చేయవచ్చు. ఇది అకాల జననానికి కారణమవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణ వైద్య పరీక్ష చికిత్స తీసుకోవాలి.

అకాల ప్రసవ సంకేతాలు
గర్భధారణ 37 వారాల ముందు నొప్పి, పెల్విక్ ప్రెజర్ లేదా ఉమ్మనీరు లీకేజ్ వంటివి అకాల ప్రసవానికి సంకేతాలు కావచ్చు. వీటిని ముందుగానే గుర్తించడం ద్వారా శిశువు ఊపిరితిత్తుల అభివృద్ధికి అవసరమైన మందులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.

పిండం కదలిక తగ్గడం
పిండం కదలిక సాధారణం కంటే తక్కువగా ఉంటే, అది గర్భంలో శిశువుకు ఆక్సిజన్ లేకపోవడం లేదా ప్లెసెంటా సమస్యల సంకేతం కావచ్చు. ఈ పరిస్థితిని అల్ట్రాసౌండ్, డాప్లర్ లేదా NST వంటి పరీక్షల ద్వారా వెంటనే అంచనా వేయాలి.

ఛాతీ నొప్పి, దడ, శ్వాస ఆడకపోవడం
గర్భధారణ చివరి దశలలో తేలికపాటి శ్వాస ఆడకపోవడం సహజమే. కానీ అకస్మాత్తుగా ఛాతీ నొప్పి, గుండె దడ లేదా తీవ్రమైన శ్వాస ఆడకపోవడం అనేది ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం లేదా గుండె జబ్బు వంటి అత్యవసర పరిస్థితి కావచ్చు.

గమనిక: ఈ వార్త వైద్య నిపుణుల సలహాలు, సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఇది వైద్య చికిత్సకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు; గర్భధారణ సమయంలో ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

Please follow and like us:
లైఫ్ స్టైల్ వార్తలు