రక్తహీనతను తగ్గించేందుకు సహజమైన మార్గాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఐరన్ ఎక్కువగా ఉండే డ్రింక్ లు. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతి రోజు ఆహారంలో ఈ డ్రింక్ లను చేర్చడం వల్ల రక్తహీనత నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
మన శరీరానికి ఐరన్ అనే పోషకం చాలా అవసరం. ఇది హిమోగ్లోబిన్‌ను తయారు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో ఎర్ర రక్తకణాలు తగ్గిపోతాయి. దీని వల్ల రక్తహీనత వస్తుంది. అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ రక్తహీనతను తగ్గించడానికి సహజంగా ఐరన్ ఎక్కువగా ఉండే డ్రింక్ లను రోజూ ఆహారంలో చేర్చడం మంచిది. అలాంటి ఆరోగ్యకరమైన డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూర మిల్క్ షేక్
ఖర్జూరాల్లో సహజమైన చక్కెర, ఐరన్, పొటాషియం, మాగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. పాలు, ఖర్జూరాలతో తయారయ్యే మిల్క్ షేక్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇది కేవలం రక్తహీనతకే కాక శరీరంలో నీరసాన్ని తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది.
ఎండు ద్రాక్ష-అంజీర్
రాత్రి నానబెట్టిన ఎండు ద్రాక్ష, అంజీర్లను తెల్లవారుజామున మిక్సీ లో వేసి స్మూతీగా తయారు చేసుకుని తీసుకుంటే శరీరానికి ఐరన్, కాపర్, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. ఇది రక్తహీనతతోపాటు ఇతర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలు ఐరన్‌తో పాటు జింక్, మాగ్నీషియం వంటి ఖనిజాలు కలిగి ఉంటాయి. ఈ గింజలను యోగర్ట్ లేదా పండ్లతో కలిపి స్మూతీగా తాగవచ్చు. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బీట్రూట్
బీట్రూట్ లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. రోజూ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది రక్తహీనతను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
దానిమ్మ
దానిమ్మ పండు ఐరన్‌తో పాటు విటమిన్ ఎ, సి, ఇ లను సమృద్ధిగా కలిగి ఉంటుంది. ప్రతి రోజు తాజా దానిమ్మ రసం తాగడం వల్ల రక్తంలో ఐరన్ శాతం పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి హిమోగ్లోబిన్ లెవెల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
నల్ల నువ్వుల నీరు
నల్ల నువ్వుల్లో అధికంగా ఐరన్ ఉంటుంది. ఇవి శరీరానికి అవసరమైన మంచి కొవ్వులను కూడా అందిస్తాయి. నువ్వులను రాత్రి నానబెట్టి తెల్లవారుజామున వాటిని బెల్లంతో కలిపి నీటితో మిక్స్ చేసి తాగితే రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.
పాలకూర స్మూతీ
పాలకూరలో ఐరన్ మాత్రమే కాకుండా ఫోలేట్, విటమిన్ కె, కాల్షియం కూడా ఉంటుంది. పాలకూరను అరటిపండు లేదా సిట్రస్ పండ్లతో కలిపి స్మూతీగా తయారు చేసుకుని తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. ఇది రుచిగా ఉండటంతో పాటు శక్తిని కూడా ఇస్తుంది.
ఉసిరి
ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ శోషణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉసిరి రసాన్ని పాలకూర లేదా బీట్రూట్ జ్యూస్‌తో కలిపి తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ డ్రింక్ లను రోజువారీ డైట్లో చేర్చడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిని సహజంగా పెంచుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)