నల్గొండ నేతన్నలు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. తమ కళా నైపుణ్యంతో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించారు. యంగ్ వీవర్ విభాగంలో గూడ పవన్ కుమార్, మార్కెటింగ్ విభాగంలో గజం నర్మదా నరేందర్‌లు ఎంపికయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు పురస్కాలు అందుకోనున్నారు.
చేనేత కళాకారుల నైపుణ్యానికి.. వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు ఉమ్మడి నల్లగొండ జిల్లా. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక చేనేతన్నలు తయారు చేసిన తేలియా రుమాలుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. తాజాగా కేంద్రం ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారాలు పుట్టపాకకు వరించాయి. పుట్టపాకలో వెయ్యి కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడి కళాకారులు నేసిన వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో తళుకులీనుతున్నాయి. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన తేలియా రుమాలు పుట్టపాక చేనేత కళాకారుల ప్రతిభకు నిదర్శనం. కేంద్రం ప్రతిఏటా అందించే జాతీయ చేనేత అవార్డులు పుట్టపాకకు చెందిన ఇద్దరు చేనేత కార్మికులను వరించాయి. యంగ్ వీవర్ విభాగంలో గూడ పవన్ కుమార్, మార్కెటింగ్ విభాగంలో గజం నర్మదా నరేందర్‌లు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 19 మంది ఎంపికవ్వగా.. రాష్ట్రం నుంచి ఇద్దరికి పురస్కారాలు దక్కడం విశేషం. వీరికి ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
సహజసిద్ధ రంగులతో చీరకు రూపం…
ప్రకృతి సహజ సిద్ధంగా లభించే చెట్ల పూలు, పండ్లు, వేర్లు, బంతి పువ్వులు, దానిమ్మ పండ్లు మంజి వేర్లు, ఇండిగో ఆకులు, వనమూలికలతో పటిక, కరక్కాయ, హీరాకాసుతో ఎరుపు, నీలం, పసుపు మొదలైన సహజ రంగులను తయారు చేస్తారు. మల్బరీ పట్టుదారానికి సహజరంగులను అద్ది.. జీఐ ట్యాగ్ పొందిన ‘తేలియా రుమాల్’ డిజైన్‌తో పట్టుచీరను పుట్టపాకకు చెందిన గూడ పవన్ నేశారు. ఆరు నెలలకు పైగా శ్రమించి ఈ పట్టు చీరను తయారు చేశాడు. ఈ పట్టు చీరలో ప్రత్యేకంగా ప్రాచీన సంప్రదాయం ప్రతిబింబించే 16 ఆకృతులను సహజ రంగులతో అద్దాడు. ముడతలు పడని మృధుత్వంతో చీరను రూపొందించారు. ఒక్కో చీర ఖరీదు రూ.75 వేలు ఉంటుంది. గత ఏడాది మార్చి 17న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎదుట చేనేత కార్మికుడు పవన్ కుమార్ మగ్గంపై వస్త్రం నేశారు. 2010లో జాతీయ చేనేత పురస్కారాన్ని సాధించిన తన తండ్రి గూడ శ్రీను స్ఫూర్తితో ఈ పురస్కారానికి ఎంపికయ్యానని ఆయన చెబుతున్నారు.
చేనేత వ్యాపారంలో రూ.8 కోట్ల టర్నోవర్..
పుట్టపాకకు చెందిన నర్మదా నరేందర్.. హైదరాబాదులోని కొత్తపేటలో నరేంద్ర హ్యాండ్లూమ్స్ పేరుతో చేనేత వస్త్రాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. చేనేత మగ్గాలపై వస్త్రాలు నేయిస్తూ.. రూ.8 కోట్ల విలువైన చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేశారు. ఇక్కత్ వస్త్రాల తయారీలో మార్కెట్‌కు అనుగుణంగా నూతన డిజైన్లను తయారు చేస్తున్నారు. అపురూపమైన సృజనాత్మకతతో కూడిన వస్త్రాలను సేకరించి.. ముంబాయి, ఢిల్లీ, కోల్‌కత్తా, హైదరాబాద్ నగరాలతోపాటు పలు దేశాల్లోనూ మార్కెటింగ్ చేస్తున్నారు. దీంతో జాతీయ చేనేత మార్కెటింగ్ విభాగంలో నర్మదా నరేందర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. పుట్టపాకతో పాటు నల్గొండ జిల్లాలోని 300 చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. కనుమరుగవుతున్న చేనేతపరిశ్రమను తోడ్పాటునందించడంతో ఈ పురస్కారం వరించిందని ఆమె చెబుతున్నారు.