ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం

ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం

మంచిర్యాల జిల్లాలో తల్లీ కూతుళ్ల మృతి కలచివేసింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో మానసిక వేదనకు గురైన వివాహిత స్పందన, 11 నెలల చిన్నారితో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పుత్రోత్సాహం లేని జీవితం వ్యర్థం అని తను పదే, పదే చెప్పి బాద పడేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

నాలుగేళ్ల క్రితం వివాహం.. భర్త ప్రభుత్వ ఉద్యోగి.. బంగారం లాంటి ఇద్దరు కూతుర్లు. ఇంకే కావాలి ఆనందమైన జీవితం అంతకు మించి ఏముంటుంది అనుకుంటారంతా. కానీ ఆ తల్లి మాత్రం మగ సంతానం లేదని కుమిలిపోయింది. ఇక వారసుడు రాడని మనోవేదనకు గురైంది. భర్తతో పదే పదే ఇదే విషయం చెప్పుకుంటూ కుంగిపోయింది. ఇక తాను బతకలేనని.. ఆత్మహత్య చేసుకుని చనిపోతానంటూ కుటుంబ సభ్యుల ముందు‌ గోడు వెళ్లబోసుకుంది‌. చివరకు అన్నంత పని చేసింది. పుత్రోత్సాహం లేని ఈ జన్మ వ్యర్థం అంటూ 11 నెలల కూతురుతో కలిసి వ్యవసాయ బావిలో దూకి తనువు చాలించింది ఆ తల్లి. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడలో చోటు చేసుకుంది.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్ల గూడ గ్రామానికి చెందిన షట్పల్లి శ్రావణ్ కుమార్‌కు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన స్పందన (24) తో 2020 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరిద్దరికి పండంటి ఇద్దరు కూతుర్లు జన్మించారు. పెద్ద కూతురు మోక్షశ్రీ వయసు మూడు ఏళ్లు కాగా.. చిన్న కూతురు వేద శ్రీ 11 నెలల చిన్నారి‌. అయితే వేదశ్రీ పుట్టిన నాటి నుంచి ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారంటూ స్పందన మానసికంగా కుంగిపోయింది. జీవితంపై విరక్తి పుడుతోందని, ఆత్మహత్య చేసుకుంటానంటూ చాలాసార్లు భర్త శ్రవణ్‌తో చెప్పింది. భార్యకు నచ్చచెబుతూ వచ్చాడు శ్రవణ్. 13 బెటాలియన్ గుడిపేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్.. విధి నిర్వహణలో భాగంగా బిజి అయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో చిన్న కూతురు వేదశ్రీకి అన్నం తినిపిస్తానంటూ కూతురిని తీసుకుని బయటకు వెళ్లింది. అలా బయటకు వెళ్లిన కోడలు ఎంతకు తిరిగి రాకపోవడంతో గమనించిన అత్తామామలు ఇంటి వెనకాలకు వెళ్లి చూడగా బావిలో స్పందన తేలియాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి బావి నుంచి ఆమెను బయటకు తీశారు. చిన్నారి వేదశ్రీ ఎక్కడా అంటూ చుట్టు పక్కల గాలించారు. చివరికి 11 నెలల చిన్నారి వేదశ్రీ సైతం బావిలోనే శవమై తేలడంతో అంతా గుండెలు బాదుకున్నారు. సమాచారం అందుకున్న జన్నారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుత్రికి తరలించారు. మరణ వార్త తెలుసుకున్న భర్త శ్రావణ్ భార్య కూతురి మృతదేహాన్ని చూసి స్పృహ తప్పిపడిపోయాడు. ఈ విషయాలు ఏమి తెలియని మూడేళ్ల పెద్ద కూతురు మోక్షశ్రీ అమ్మ చెల్లి ఎక్కడా అంటూ కుటుంబ సభ్యులను అడగటం అందరిని కలిచివేసింది. స్పందన తల్లి బూదారపు ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జన్నారం పోలీసులు తెలిపారు. వారసుడు పుట్టలేదన్న కారణంగానే ప్రాణాలు తీసుకుందని అత్తింటివారు కన్నీరు మున్నీరయ్యారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు