ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు.. ఎందుకంటే?

ఈసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు.. ఎందుకంటే?

నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. ఆరో వార్డు బీజేపీ అభ్యర్థిగా ఉన్న మహదేవ్‌ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనగంగా మారింది. అయితే ఇతర పార్టీ నేతల బెదిరింపుల కారణంగానే మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి మృతి కారణంగా ఆరో వార్డు ఎన్నిక రద్దు చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, గిరిజన బిడ్డ ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రం విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహదేవప్ప మరణానికి కాంగ్రెస్ పార్టీ అహంకార రాజకీయాలు, మాఫియా బెదిరింపులే కారణమని ఆయన రోపించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మక్తల్‌లో బిజెపి ర్యాలీ విజయవంతం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక, బిజెపి అభ్యర్థులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయని. ఈ మాఫియా రాజకీయాలు, అహంకార ధోరణి తట్టుకోలేకే మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా ఈ ఘటనపై కేంద్రంమంత్రి బండిసంజయ్ సైతం స్పందించారు. మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్యని ఆరోపించారు. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోందని.. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తారా? ఎన్నికల తరువాత కాంగ్రెస్ పై యుద్దం చేయబోతున్నామన్నారు. బీఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్తాపితం చేసే రోజులొచ్చాయని.. బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు.

అయితే మక్తల్​లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు కాంగ్రెస్ నేతలే కారణమని ఆరోపిస్తూ టీబీజేపీ నేతలు హైదరాబాద్​లోని డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం తలెత్తింది. బీజేపీ నేతలు డీజీపీ ఆఫీస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చెలరేగింది.ఈ క్రమంలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే బీజేపీ అభ్యర్థి మృతి ఘటనపై డీజీపీ శివధర్​ రెడ్డి స్పందించారు. మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్టు తమకు ఫిర్యాదు వచ్చిందని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు