చార్మినార్ లాడ్ బజార్‌లో గాజుల సందడి.. మిస్ వరల్డ్ సుందరీమణుల రాకతో కొత్త శోభా!

చార్మినార్ లాడ్ బజార్‌లో గాజుల సందడి.. మిస్ వరల్డ్ సుందరీమణుల రాకతో కొత్త శోభా!

చార్మినార్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ప్రసిద్ధ చారిత్రాత్మక కట్టడం..చార్మినార్‌ లానే ఇక్కడ దొరికే గాజులు కూడా మస్త్‌ ఫేమస్. అంతెందుకు అసలు చార్మినార్ అంటేనే అందమైన గాజులకు ప్రసిద్ధి. ఇక్కడి లాడ్ బజార్‌లో దొరికే గాజులకు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఇక్కడ గాజులు కొనేందుకు వివిద రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. దానికి కారణం ఇక్కడకి మిస్‌ వరల్డ్‌ ముద్దుగుమ్మలు రావడం.

హైదరాబాద్‌ నగరం పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతంలో ప్రసిద్ధ గాజుల మార్కెటే ఈ లాడ్ బజార్‌. ఇక్కడ ప్రత్యేకంగా తయారుచేసిన గాజులు విరివిగా దొరుకుతాయి. లాడ్ బజార్‌లో షాపింగ్ చేయడానికి వచ్చే ఆడవాళ్లతో ఆ ప్రాంతమంతా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అంతటి పేరున్న ఈ ప్రాంతం కొన్ని రోజులుగా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. దీనికి ప్రధాన కారణం మిస్ వరల్డ్ పోటీలకు చెందిన అంతర్జాతీయ సుందరీమణులు ఇటీవల చార్మినార్‌ను సందర్శించడమే. ప్రపంచ దేశాల అందగత్తెలు ఈ ప్రాంతాన్ని సందర్శించడంతో అందరి నోళ్లలో ఇప్పుడు లాడ్ బజార్‌ పేరే వినబడుతోంది. దాంతో పాటు సహజంగానే అమ్మకాలు పెరిగినట్టు స్థానిక వ్యాపారస్తులు చెబుతున్నారు.

అయితే.. ఇదే సందర్భాన్ని అవకాశంగా మలచుకున్న గాజుల వ్యాపారులు తమ షాపుల్ని కొత్తగా అలంకరిస్తున్నారు. సందర్శకులను, కొనుగోలుదారులను ఆకర్షించడానికి వింత వింత డిజైన్ల గాజులతో, ట్రెండీ కలర్స్‌తో, శబ్దాన్ని ఇస్తూ మెరిసిపోతున్న వయ్యారపు గాజులతో బజార్‌ను కళకళలాడేలా తీర్చిదిద్దుతున్నారు. పాకిస్థాన్, రాజస్థాన్, లక్నో వంటి తదితర ప్రదేశాల నుంచి తెప్పించిన ప్రత్యేక హ్యాండ్‌మేడ్ గాజులు ఇప్పుడు లాడ్ బజార్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే చార్మినార్ పరిసరాలు ప్రపంచ అందగత్తెలు రాకతో మరింత కొత్త శోభను సంతరించుకున్నాయి. ఎప్పుడూ సందర్శకులతో హడావిడిగా ఉండే ఈ ప్రాంతం మిస్‌ వరల్డ్‌ బావమల సందర్శనతో మరింత సందడిగా మారింది. ఇది ఒక రకంగా నగర అభివృద్ధికి, వ్యాపార లావాదేవీలకు మంచి చేస్తుందని అంటున్నారు స్థానికులు. ప్రపంచ దేశాల సుందరీమణులు చార్మినార్ గాజులపై ఆసక్తి చూపడంపై స్థానిక వ్యాపారులకు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లయింది. దీంతో ఇప్పుడు వివిధ దేశాల పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండడం.. నగర అభివృద్ధికే కాకుండా తమకు కలిసొచ్చిందని వ్యాపారాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లాడ్ బజార్ అంటే కేవలం గాజుల మార్కెట్‌ మాత్రమే కాదు.. గ్లోబల్ గ్లామర్‌కు తెరతీసే అద్దం అవుతుందని, ఇది స్వాగతించదగిన పరిణామం అని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు