తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఇంకా కేవలం వారం రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీనంగర్ జిల్లాలోని సర్పంచ్ అభ్యర్థులు ప్రజల డిమాండ్‌లు పోలింగ్ కంటే ముందే తీర్చేస్తున్నారు. ఎందుకంటే.. అక్కడి గ్రామస్తులు తమకున్న ప్రధాన సమస్యను ఎవరు తీరుస్తే వారికే ఓటేస్తామని తేల్చి చెప్పడంతో.. అభ్యర్థులు ఆ పనుల్లో మునిగిపోయారు. ఇంతకు జనాలకొచ్చిన అంత పెద్ద సమస్య ఏంటో తెలుసుకుందాం పదండి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం ప్రధాన సమస్య ఒక్కటేఏ.. అదే కోతుల సంచారం. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో ఈ సమస్య ఉంది. దీంతో గ్రామాల్లోకి ఓట్లు అడిగేందుకు వెళ్లే ప్రతి అభ్యర్థికి ఒకే డిమాండ్ ఎదురైంది. తమ గ్రామంలోంచి కోతులను వెళ్లగొడితే మీకు ఓట్లు వేస్తామని జనాలు చెప్పడంతో.. అభ్యర్థులు కూడా అందుకు అంగీకరించి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇలానే హామీ ఇచ్చిన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి చిరంజీవులు.. పోలింగ్‌కు ముందే తను ఇచ్చిన హామీ నెరవేర్చుతున్నాడు.
వెన్నంపల్లిలో కోతులు ఇళ్లలోకి చొరబడటం, పంటలను ధ్వంసం చేయడం, చివరకు చిన్నపిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సర్పంచ్ అభ్యర్థి చిరంజీవులు దృష్టికి గ్రామస్తులు ఈ సమస్యను తీసుకువచ్చారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని చిరంజీవులు ప్రజలకు హామీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఎన్నికల ముందే గ్రామంలోని కోతులను తొలగించే ప్రక్రియ మొదలు పెట్టాడు.
ఈ కోతులను పట్టుకునేందుకు నిపుణులైన వారిని ప్రత్యేకంగా గ్రామానికి రప్పించారు. వారు పకడ్బందీ ఏర్పాట్లతో కోతులను పట్టి వాటిని గ్రామం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ చర్యతో చిరంజీవిపై గ్రామస్తుల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ఎన్నికల బరిలో ఉన్నా.. ఇతర అభ్యర్థులు ఇంకా ప్రచార పర్వంలో మునిగి ఉండగా చిరంజీవి మాత్రం ఓటర్ల ప్రధాన సమస్యను పరిష్కరిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. కోతుల బెడద నుంచి విముక్తి లభిస్తేనే ఓటు అన్న గ్రామస్తుల నినాదానికి అనుగుణంగా కోతులను తొలగిస్తున్నాడు. వాటికి వివిధ ఆహార పదార్థాలను అందించి బోన్లో బందిస్తున్నారు. వాటిని దూరంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నారు.

